కమల్‌హాసన్‌లా పేరు తెచ్చుకోవాలని ఉంది!

16 Apr, 2014 23:59 IST|Sakshi
కమల్‌హాసన్‌లా పేరు తెచ్చుకోవాలని ఉంది!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొంతమంది తారలు చెబుతుంటారు. అజ్మల్ ఆ కోవకు చెందినవారే. తండ్రి లాయర్. కొడుకుని డాక్టర్ చేయాలన్నది ఆయన కల. కానీ, అజ్మల్‌కి మాత్రం సినిమాలంటే ప్రాణం. తండ్రి కోరిక మేరకు ఎంబీబీఎస్ చదివి, ఆ తర్వాత సినిమాల్లోకొచ్చేశారు. తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్ ‘రంగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘రచ్చ’లో కీలక పాత్ర చేసిన అజ్మల్ తెలుగులో సోలోగా చేసిన ‘ప్రభంజనం’ రేపు విడుదల కానుంది. సోలో హీరోగా తెలుగులో బ్రేక్ తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా చేయలేదని, కథ నచ్చడం వల్లే చేశానని అజ్మల్ చెబుతూ -‘‘ఇలాంటి కథలు ఏ పది, పదిహేనేళ్లకో మాత్రమే వస్తాయి. ఇది సాదాసీదా కథ కాదు. అందుకే చేశాను. సమాజానికి మంచి చేయాలనుకొనే ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా.

అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఆ తర్వాత ఓ మంచి పౌరుడిగా ఎలా మారాడు? సమాజానికి ఏ విధంగా మంచి చేశాడు? అనేది కథాంశం. తాత, తండ్రి, కొడుకు.. ఇలా మూడు తరాలకు సంబంధించిన కథ. అందుకని మూడు తరాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. నాది రెండు కోణాలున్న పాత్ర కావడంతో నటుడిగా నాకు సవాల్ అనిపించింది. రాజకీయాల నేపథ్యంలో సాగే సినిమా అయినా, ఏ పార్టీపైనో, ప్రధానంగా ఏ రాజకీయ నాయకుడిపైనో వ్యంగ్యాస్త్రాలు ఉండవు. అలాగే ఎవర్నీ సపోర్ట్ చేసే సినిమా కాదు. దర్శకుడు వేండ్రాతి భాస్కరరావు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు. వంశీ దర్శకత్వంలో చేసిన ‘తను మొన్నే వెళ్లిపోయింది’ విడుదలకు సిద్ధమైందని, ఆయన దర్శకత్వంలో నటించడం తన అదృష్టమని అజ్మల్ అన్నారు. భవిష్యత్తులో ఓ ఆస్పత్రి కట్టించాలనుకుంటున్నానని చెప్పారు. దక్షిణాది భాషల్లో సినిమాలు చేసి, కమల్‌హాసన్‌లా బహుభాషా నటుణ్ణి అనిపించుకోవాలన్నదే తన లక్ష్యమని అజ్మల్ తెలియజేశారు.