కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం

24 Dec, 2013 14:20 IST|Sakshi
కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం

సంగీత ప్రపంచ రారాజు ఇళయరాజా ఆరోగ్యం కుదుటపడిందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇళయరాజాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఇళయరాజాకు గుండెలో కొద్దిగా నొప్పి అనిపించడంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అంతా బాగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు.

''మా మామయ్య, ఇసైజ్ఞాని ఇళయారాజా బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసినవారికి, ప్రేమను అందించిన వారికి అందరికీ కృతజ్ఞతలు'' అని వెంకట్ ప్రభు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఇళయరాజాను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. పలు భాషల్లో ఇళయరాజా ఇప్పటికి 900కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా తలైమురైగల్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిని దోచుకుంది. దళపతి, క్షత్రియపుత్రుడు, దేవరాగం, నాయకుడు.. ఇలా అనేక చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. త్వరలో ఆయన మలేసియాలో లైవ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.