జాగింగ్‌ చేస్తుండగా కంపెనీ సీఈవోకు గుండెపోటు.. ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ వాచ్‌

9 Nov, 2023 15:33 IST|Sakshi

ఓ స్మార్ట్‌ వాచ్‌ 42 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కాపాడింది. మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన  కంపెనీ సీఈవోకు ఉన్నట్టుండి ఛాతిలోనొప్పి రావడంతో.. స్మార్ట్‌వాచ్‌ అతన్ని రక్షించింది. స్మార్ట్‌ఫోన్‌ సాయంతో భార్యకు సమాచారం ఇవ్వగా.. నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. గుండెపోటు నుంచి బయటపడటానికి స్మార్ట్‌ వాచ్‌ ఎలా సాయపడిందనే విషయాన్ని ఆయనే స్వయంగా  వివరించారు. ఈఘటన బ్రిటన్‌లో జరిగింది. 

హాకీ వేల్స్‌ కంపెనీ సీఈవో పాల్‌ వాపమ్‌ స్వాన్‌సీలోని మోరిస్టన్‌ ప్రాంతంలో నివిసిస్తుంటారు. ఆయనకు రోజూ జాగింగ్‌కు వెళ్లడం అలవాటు. ఓ రోజు ఉదయం 7 గంటలకు ఇంటి సమీపంలోనే జాగింగ్‌కు వెళ్లారు. పరుగెత్తుతుండగా అయిదు నిమిషాలకు అకస్మాత్తుగా అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి వచ్చింది. గుండె బిగుతుగా అనిపించడంతో ఒక్కసారిగా రోడ్డుమీద కుప్పకూలిపోయారు. వెంటనే తన చేతికున్న స్మార్ట్‌ వాచ్‌ ద్వారా భార్య లారాకు ఫోన్‌ చేశాడు. ఆమె అక్కడికి చేరుకొని తన కారులో అతన్ని నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి తీసుకెళ్లింది. 
చదవండి: బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు

డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అదించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. అయితే గుండె ధమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్‌ అవ్వడం కారణంగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అదే ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకొని ఆరు రోజులు తరువాత ఇంటికి చేరుకున్నారు. కాగా ఈ ఘటన తనతోపాటు తన కుటుంబాన్ని షాక్‌కు గురి చేసిందని చెప్పారు. అంతేగాక తనకు ఉబకాయ సమస్యలు ఏం లేవని రోజు ధృడంగా ఉండటానికి ప్రయత్నిస్తానని తెలిపారు. సరైన సమయంలో  సాయం చేసిన స్మార్ట్‌ వాచ్‌, భార్య, ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల కాలంలో ఆపిల్ వాచ్ సిరీస్ 8 వంటి ఎల్టీఈ కనెక్టివిటీ, ఈ-సిమ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్‌లలో ఫోన్‌లు దగ్గరలో లేకునప్పటికీ కాల్‌ చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల గతంలో గుండెపోటు లక్షణాలను స్మార్ట్‌వాచ్‌లు ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయడంతో పలువురి ప్రాణాలు దక్కిన విషయం తెలిసిందే. స్మార్ట్‌వాచ్‌ల్లో ఉండే హార్ట్‌రేట్‌, ఈసీజీ వంటి సెన్సర్లు గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు