కన్నీటి పర్యంతమైన దర్శకుడు శంకర్‌

29 Feb, 2020 13:47 IST|Sakshi

మృతుల కుటుంబాలకు రూ.కోటి సాయం

ప్రమాదం షాక్‌ నుంచి ఇంకా కోలుకోలేదు : శంకర్‌

పెరంబూరు: ఇండియన్‌-2 చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యూనిట్‌ సభ్యుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. కోటి అందించనున్నట్లు దర్శకుడు శంకర్‌ ప్రకటించారు. ఇప్పటికే నటుడు కమలహాసన్‌ కోటి రూపాయలు, చిత్ర నిర్మాత సుభాష్‌కరన్‌ రూ. 2 కోట్లను అందించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం దర్శకుడు శంకర్‌ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఆయన ఇండియన్‌-2 చిత్రం షూటింగ్‌లో జరిగిన ప్రమాదం షాక్, మనోవేదన నుంచి తాను ఇంకా కోలుకోలేదన్నారు. ఒక నెల రోజుల ముందే తన వద్ద సహాయకుడిగా చేరిన కృష్ణ మృతి ఆయన్ను బాధిస్తూనే ఉందన్నారు. ఇంత భారీ బడ్జెట్‌ చిత్ర యూనిట్‌లో చేరిన కొద్ది రోజుల్లోనే అర్థం చేసుకుని చాలా చక్కగా పని చేసిన వ్యక్తి కృష్ణ అని, అతన్ని కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు.

కృష్ణ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు అతని తల్లి పడిన ఆవేదన ఇంకా తన కళ్లలో మెదులుతూనే ఉందని వాపోయారు. ప్రొడక్షన్‌ బాయ్‌ మధును మార్చురీలో చూసి తన గుండె ముక్కలైందని, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చంద్రన్‌ మరణం తనను తీవ్రంగా బాధిస్తోందని, దుఖం ఆగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా అనూహ్యంగా జరిగిన ప్రమాద ఘటనతో షాక్‌ నుంచి బయట పడలేక వేదన పడుతున్నానని శంకర్‌ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదం వ్వవహారంపై కేసు దర్యాప్తు చేస్తున్న క్రైంబ్రాంచ్‌ పోలీసు అధికారుల విచారణకు శంకర్‌ హాజరైన విషయం తెలిసిందే. కాగా కమలహాసన్‌ కూడా త్వరలో విచారణకు హాజరు కానున్నట్లు తెలిసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు