ఊ.. కొడతారా?

17 Jul, 2016 00:32 IST|Sakshi
ఊ.. కొడతారా?

మెగాస్టార్ చిరంజీవి అండ్ కో ప్రతిపాదనకు ప్రముఖ నటుడు జగపతిబాబు ఊ.. కొడతారా? ఊహూ.. అంటారా? జగ్గూ భాయ్ మనసులో ఏముంది? ఫిల్మ్‌నగర్ ప్రముఖుల్లో హాట్ టాపిక్ ఇది. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకునిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 150వ చిత్రంలో ప్రతినాయకునిగా నటించమని జగపతి బాబుని అడిగారట. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కథానాయకునిగా నటించిన తమిళ చిత్రం ‘కత్తి’కి ఇది రీమేక్ అనే విషయం తెలిసిందే.
 
 బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ ‘కత్తి’లో ప్రతినాయకునిగా నటించారు. సూటూ.. బూటూ.. మల్టీ నేషనల్ కంపెనీ అధినేత పాత్రలో నీల్ చాలా స్టైలిష్‌గా కనిపించారు. టిపికల్ విలన్ క్యారెక్టర్ అది. డ్రస్సింగ్ స్టైల్, మేకోవర్ అంతా ఇటాలియన్ లుక్‌లో ఉంటుంది. తెలుగులో ఈ పాత్ర జగపతి బాబు చేస్తే బాగుంటుందని చిరు 150వ చిత్రబృందం భావించారట. ఎందుకంటే.. ‘లెజెండ్’లో బాలకృష్ణతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో ప్రతినాయకునిగా జగ్గూ భాయ్ రౌద్రరసం పలికించిన తీరుకి సర్వత్రా ప్రశంసలు లభించాయి.
 
 సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌గానూ కనిపించారు. దీంతో వీవీ వినాయక్ ఆయన్ను సంప్రతించారట. అయితే.. జగపతి బాబు మాత్రం ఇంకా ఏ మాటా చెప్పలేదని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే రజనీకాంత్, బాలకృష్ణ, చిన్న ఎన్టీఆర్‌ల చిత్రాల్లో ప్రతినాయకునిగా నటించిన జగపతిబాబు, చిరంజీవి చిత్రంలోనూ ప్రతినాయకునిగా నటిస్తారా? లేదా? వెయిట్ అండ్ సీ.