నాలుగోసారి... పెళ్ళిపీటలపై కబీర్‌బేడీ

19 Jan, 2016 00:18 IST|Sakshi
నాలుగోసారి... పెళ్ళిపీటలపై కబీర్‌బేడీ

గుబురు గడ్డం... గుర్తుపట్టే రూపం... గంభీరమైన స్వరం... కబీర్ బేడీని చూడగానే ఇవన్నీ బొమ్మ కడతాయి. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడైన కబీర్ బేడీ అనగానే, అప్పట్లో ప్రసిద్ధమైన దుస్తుల అడ్వర్టైజ్‌మెంట్స్ గుర్తొచ్చేవి. ప్రముఖ నటి పూజా బేడీ తండ్రి అయిన కబీర్ బేడీ తన 70వ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. చిరకాలంగా తన స్నేహితురాలైన 40 ఏళ్ళ పర్వీన్ దుసంజ్‌ను తన పుట్టినరోజైన శనివారం నాడు అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని, పార్టీకి వచ్చిన బంధుమిత్రుల్నీ, అతిథుల్నీ ఆశ్చర్యపరిచారు. కబీర్ బేడీకి ఇది నాలుగో పెళ్ళి.

నిజానికి, పర్వీన్, కబీర్ బేడీలు గడచిన పదేళ్ళుగా కలిసి ఉంటున్నారు. కబీర్ బేడీ కుమార్తె పూజా బేడీ కన్నా పర్వీన్ నాలుగేళ్ళు చిన్న. ఈ పెళ్ళి విషయం తండ్రి తనకు ముందుగా చెప్పలేదని ఆరోపించిన పూజా బేడీకి సహజంగానే ఈ వివాహం నచ్చలేదు. ‘ప్రతి అద్భుత జానపద గాథలో ఒక మంత్రగత్తె కానీ, దుష్టురాలైన సవతి తల్లి కానీ ఉంటుంది. నాకిప్పుడు అలాంటి ఆవిడ వచ్చింది! పర్వీన్ దుసంజ్‌ను కబీర్ బేడీ పెళ్ళి చేసుకున్నారు’ అని పూజాబేడీ ఆదివారం ట్వీట్ చేశారు. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్‌ను తానే తొలగించారు!

 ముంబయ్‌లో జరిగిన పుట్టినరోజు పార్టీకి అమెరికా, బ్రిటన్, దుబాయ్, మలేసియా, ఐరోపా తదితర దేశాల నుంచి మిత్రుల్ని కబీర్ బేడీ ఆహ్వానించారు. ‘కబీర్ బేడీ, పర్వీన్ దుసంజ్‌ల సంయుక్త ఆహ్వానం’ అని ఆహ్వానపత్రికలోనే పేర్కొన్నారు. తండ్రీ కూతుళ్ళ మధ్య విభేదాలను బహిర్గతం చేసిన ఆ పాత ట్వీట్ సంచలనం రేపడంతో, దాన్ని తొలగించిన పూజా బేడీ కొత్తగా మరో ట్వీట్ చేశారు. ‘‘మా నాన్న గారి నాలుగో పెళ్ళి గురించి చేసిన గత ట్వీట్‌ను తొలగించాను.

అంతా సానుకూలంగా చూద్దాం. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని ఆ ట్వీట్‌లో పూజా బేడీ పేర్కొన్నారు. అతిథులతో సహా ఎవరికీ ముందుగా సమాచారం లేని ఈ పెళ్ళికి పూజ గైర్హాజరవడం గమనార్హం. కాగా, ఈ విషయమై ఆమె వివరణనిస్తూ, ‘‘గడచిన రెండు మూడేళ్ళుగా నాకూ, మా నాన్న గారికీ మధ్య కొన్ని వ్యక్తిగత తగాదాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ, నాకూ, పర్వీన్‌కూ మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఆ తగాదాలు పెరిగిపోయాయి. నన్ను వాళ్ళ పెళ్ళికి పిలవలేదు’’ అని చెప్పారు.

 ప్రసిద్ధ ఒడిస్సీ నర్తకి అయిన మొదటి భార్య ప్రతిమా బేడీ ద్వారా కబీర్ బేడీకి కలిగిన సంతానం - నటి పూజా బేడీ. ఆ తరువాత ఆయన సుసాన్ హమ్‌ఫ్రేస్, నిక్కీ బేడీలను వివాహం చేసుకున్నారు. ఆ బంధాలన్నీ విచ్ఛిన్నమయ్యాక పర్వీన్‌కు దగ్గరైన కబీర్ సుదీర్ఘ కాలం సహజీవనం తర్వాత ఇప్పుడు ఆమెను పెళ్ళి చేసుకున్నారు. నాన్న చేసుకున్న కొత్త పెళ్ళితో సహజంగానే కుమార్తె అలిగినట్లుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి