శ్రీమంతుడిపై విశ్వనాయకుడు ప్రశంసలు

18 Aug, 2015 05:11 IST|Sakshi
శ్రీమంతుడిపై విశ్వనాయకుడు ప్రశంసలు

తమిళసినిమా : ఒక నటుడి నటనను మరో నటుడు అభినందించడానికి చాలా పెద్ద మనసు కావాలి. అలా ప్రశంసించే ఉన్నత వ్యక్తిత్వం విశ్వనాయకుడు కమలహాసన్‌కు, ఆ అర్హత ప్రిన్స్ మహేశ్‌బాబుకు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకెళితే టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం శ్రీమంతుడు ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయ విహారం చేస్తున్న విషయం తెలిసిందే.

మంచి కథ, కథనం, దర్శకత్వం, విలువలతో కూడిన నిర్మాణం, నటీనటుల ఉత్తమ నటన, చక్కని సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన చిత్రం శ్రీమంతుడు అంటూ సర్వత్రా అభినందనలు అందుకుంటున్న నేపథ్యంలో నటుడు కమలహాసన్ ప్రశంసలు చిత్ర యూనిట్ రెట్టింపు సంతోషానికి గురి చేశాయి. ఇందులో కథానాయికిగా శ్రుతీహాసన్ నటించారన్నది తెలిసిన విషయమే.  శ్రీమంతుడు చిత్రాన్ని ఆమె ఇటీవల తన తండ్రి కమల్‌కు చూపించారు.
 
చిత్రం చూసిన కమలహాసన్ మహేశ్‌బాబు నటన, డాన్స్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.  శ్రుతి డాన్స్‌ను అభినందిం చారు.   సామాజిక సృహ ఉన్న కథాంశంతో రూపొందించిన దర్శకుడిని, నిర్మాతను అభినందించారు. ఇది తెలిసిన మహేశ్‌బాబు ఇంకా ఖుషీ అవుతున్నారట. కాగా, శ్రీమంతుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారానికి 101.25 కోట్లు వసూలు చేసి వంద కోట్ల క్లబ్‌లో చేరినట్లు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత వెల్లడించారు.