‘అక్షయ్‌ ఒప్పుకొన్నాడు కాబట్టే ఓకే అయ్యింది’

10 Sep, 2019 14:48 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ‘క్వీన్‌’ , జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్‌ ‘ఖిలాడి’ అక్షయ్‌ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నందుకు ప్రతీ ఒక్కరు అక్షయ్‌ను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. అక్షయ్‌, విద్యా బాలన్‌, నిత్యా మీనన్‌, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో మిషన్‌ మంగళ్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా పోస్టర్లలో అక్షయ్‌ కుమార్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘కావేరీ పిలుస్తోంది’  పేరిట నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమానికి హాజరైన కంగనా ఈ విషయంపై స్పందించారు.

కంగనా మాట్లాడుతూ...‘ సినిమా చూసే ప్రేక్షకులలో 80 శాతం మంది మగవాళ్లే ఉంటారు. వారిలో చాలా మంది సినిమాను ఒక వినోద మాధ్యమంగానే పరిగణిస్తారు. అటువంటి వారే మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఆదరించడానికి ఇష్టపడరు. ఉదాహరణకు మిషన్‌ మంగళ్‌ అనేది మహిళా శాస్త్రవేత్తల విజయాల గురించి తెరకెక్కిన సినిమా. అయితే ఆ సినిమా విషయంలో అక్షయ్‌ను కొంతమంది విమర్శించారు. నిజానికి అక్షయ్‌ ఒప్పుకున్నాడు కాబట్టే స్క్రిప్ట్‌ ఓకే అయ్యింది. అందుకే క్రెడిట్‌ మొత్తం అక్షయ్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప తనను విమర్శించడం తగదు. నా మణికర్ణిక చిత్రాన్ని చాలా మంది హీరోలు సపోర్టు చేశారు. స్టార్ హీరోలుగా పేరొందిన వారు ఇలాంటి సినిమాలకు ప్రచారం చేస్తే బాగుంటుంది’అని పేర్కొన్నారు. కాగా ఇటీవలే విడుదలైన కంగనా సినిమా ‘జడ్జి మెంటల్‌ హై క్యా’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక కంగన ప్రస్తుతం... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు