అమీర్ దారిలో హీరో నవీన్ కృష్ణ

4 Sep, 2014 09:50 IST|Sakshi
అమీర్ దారిలో హీరో నవీన్ కృష్ణ

బెంగళూరు :శాండల్‌వుడ్ నటుడు నవీన్‌కృష్ణ, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా...తెరపై నగ్నంగా కనిపించడంలో! అవును పి.కె సినిమా మొదటి పోస్టర్‌లో రైలు పట్టాల మధ్య అమీర్‌ఖాన్ నగ్నంగా కనిపించి పలు వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాండల్‌వుడ్ నటుడు నవీన్ కృష్ణ కూడా శాండల్‌వుడ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా వెండితెరపై నగ్నంగా కనిపించేందుకు ఓకే చెప్పేశారు. నవీన్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా మాటల రచయితగా కూడా పనిచేస్తున్న 'హగ్గద కొనె' సినిమాలో ఈ సన్నివేశాలు కనిపించనున్నాయి.

ఈ సినిమాకు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తుండగా, ఉమేష్ బనాకార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రచయిత పర్వతవాణి రాసిన ఓ నాటకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ గడిపే జైలు జీవితం సన్నివేశాలను ఎంతో సహజంగా ప్రేక్షకులకు చూపించడంలో భాగంగానే నవీన్ కృష్ణతో ఈ సన్నివేశాలను చిత్రించామని దర్శకుడు దయాల్ చెబుతున్నారు.

ఉరిశిక్షకు చేరువవుతున్న ఓ ఖైదీ నిస్సహాయ పరిస్థితులను, జైలు గోడల మధ్య అతని జీవితాన్ని కృత్రిమంగా చూపించడం తనకు ఇష్టం లేక నవీన్ కృష్ణతో ఈ విషయంపై చర్చించాన న్నారు. ఇందుకు నవీన్‌కృష్ణ అంగీకరించడంతో జైలు ఊచల వెనక నవీన్‌కృష్ణ నగ్నంగా నిలబడి ఉన్న దృశ్యాలను గత గురువారం నగరంలో వేసిన ప్రత్యేక జైలు సెట్‌లో చిత్రించామని అన్నారు. ఒక నటుడు ఇలా వెండితెరపై నగ్నంగా కనిపించడానికి సన్నద్ధమవడం శాండల్‌వుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.