మూక హత్యలపై మాట్లాడితే బెదిరింపులు : నటుడు

25 Jul, 2019 15:02 IST|Sakshi

దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇలా సంతకం చేసిన వారిలో నటుడు కౌషిక్‌ సేన్‌ కూడా ఉన్నారు. అయితే మూక హత్యల గురించి మాట్లాడిన తనను చంపుతామంటూ బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయన్నారు కౌశిక్‌ సేన్‌.

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నాకు ఫోన్‌ చేశాడు. మూక హత్యల గురించి మరోసారి మాట్లాడితే.. చాలా తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది అంటూ బెదిరించడం ప్రారంభించాడు. అప్పుడు అతనితో నేను ‘చావడానికి కూడా సిద్ధమే కానీ నా ఆలోచనను మార్చుకోను. ఇలాంటి కాల్స్‌ నన్ను భయపెట్టలేవు’ అని స్పష్టం చేశాను’ అన్నాడు కౌశిక్‌ సేన్‌. అంతేకాక ఆ నంబర్‌ను పోలీసులకు ఇచ్చినట్లు తెలిపాడు.

‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది.. దానిని అపవిత్రం చేయడం మానేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటివి దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది. ఇది చూసి మేము చాలా అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తున్నాము’ అని లేఖలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు