ఇది కల కాదు

27 Dec, 2019 08:42 IST|Sakshi

ఇది తన కల కాదు. లక్ష్య సాధనకు మార్గం అంటోంది నటి కీర్తీసురేశ్‌. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే నటిగా అతి తక్కువ సమయంలోనే చాలా సాధించేసిందని చెప్పవచ్చు. కారణం తను నటించిన మహానటి చిత్రమే. ఈ చిత్రంలో కీర్తీసురేశ్‌ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్‌. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా తనలోని నటనకు సాన పెట్టి సావిత్రి పాత్రకు కీర్తీసురేశ్‌ జీవం పోసింది. ఫలితం అభినందనల పరంపరతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తీసురేశ్‌ ముంగిట వాలింది. 

ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించిన కీర్తీసురేశ్‌ ఆ ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. అందులో పేర్కొంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆనందానుదభూతి వ్యక్తం చేయలేనిది.అయినా ప్రయత్నిస్తాను. ఈ అవార్డు నా కల కాదు లక్ష్య సాధనకు పయనం. నా ఈ పయనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.ఈ అవార్డును నన్ను ఈ స్థాయికి చేరేలా తయారు పరిచిన నా తల్లికి సమర్పిస్తున్నాను. అదే విధంగా మహానటి చిత్రంలో నటించడానికి ప్రోద్బలం ఇచ్చిన అంకుల్‌ గోవింద్‌కు, అంతకంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్రానికి మెదడు లాంటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు ధన్యవాదాలు. మహానటి చిత్రానికి సమస్తం ఆయనే. అదే విధంగా ఇందంతా చూస్తున్న మహానటి సావిత్రి నన్ను ఆశీర్వదిస్తారు అని కీర్తీసురేశ్‌ పేర్కొంది. 

కాగా  తాజాగా ఈ చిన్నది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి నటించే మరో లక్కీచాన్స్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో నటి కుష్భూ, మీనాలతో పాటు కీర్తీసురేశ్‌ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన నటి కీర్తీసురేశ్‌కు అందమైన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్‌ జాతీయ అవార్డును అందుకున్న కీర్తీసురేశ్‌ కోసం పండగ వాతావరణంలో కేక్‌ కట్‌ చేసి అభినంధించారు. నటుడు రజనీకాంత్, దర్శకుడు శివ చిత్ర యూనిట్‌ కీర్తీసురేశ్‌కు కేక్‌ తినిపించి అభినందించారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: 
సినిమాల్లో హింసకు తావివ్వొద్దు

మరిన్ని వార్తలు