తెలిసింది గోరంత...తెలియాల్సింది కొండంత!

11 Dec, 2014 22:33 IST|Sakshi
తెలిసింది గోరంత...తెలియాల్సింది కొండంత!

 సినిమా హాలు లోపలికెళ్లగానే తలుపులు మూసేస్తారు. అంతా చీకటిగా ఉంటుంది.  ఆ చీకటిలో బొమ్మ పడుతుంది వెండి తెర మీద. బొమ్మ పడగానే చీకట్లో కూర్చున్న ప్రేక్షకుడి కళ్లల్లో వెలుగు నిండుతుంది. ఎవణై్నతే చూడాలని వ్యయప్రయాసలకోర్చి వచ్చామో, వాడిని చూడగానే కనిపించే వెలుగు అది. ప్రేక్షకుడు వాడిని చూస్తాడు. వాడిలోని వాడిని చూస్తాడు. వేడిని చూస్తాడు. తన వాడిలో తనని తాను చూసుకుంటాడు.
 
 ఆ వెలుగు పంచిన ఆనందంలో కాస్సేపు తన జీవితాన్ని తను మర్చిపోతాడు. అలా చీకటిలో వెలుగును పంచేవాడే రజనీకాంత్. రజని అంటే చీకటి. కాంత్ అంటే వెలుగునిచ్చేవాడు. ఒక సాధారణ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగొచ్చు అనడానికి కొలమానం రజనీకాంత్. ఒక అసాధారణ వ్యక్తి ఎంత ఒదిగి ఉండవచ్చు అన్నదానికీ కొలమానం రజనీకాంత్. కింద నుంచి పైకొచ్చినా, పై నుండి కిందికొచ్చినా, తల కిందులుగా తపస్సు చేసినా రజనీకాంత్‌ని కొట్టేవాడు ఈ తరంలో లేడు. ఎందుకంటే రజనీకాంత్ ఎవణై్ననా కొట్టేయగలడు కాబట్టి.
 
 ఇదంతా ఎందుకంటే... ఇవ్వాళ రజనీకాంత్ పుట్టిన రోజు. ‘లింగ’గా మరోసారి పుట్టిన రోజు. రజనీ ఒక పుట్టిన రోజే ఎంతో ఘనంగా ఉంటుంది. రెండు పుట్టిన రోజులు ఒకే రోజొస్తే ఇంకెంత ఘనంగా ఉంటుందో?
 చాలా మంది నటులకి పాత్ర పూనుకుంది అంటాం. వాళ్లు కూడా ఫలానా పాత్ర చాలా కాలం నాలో ఉండిపోయింది, అలాగే బిహేవ్ చేసేవాణ్ణి అనడం వింటాం. ఒక్కసారయినా రజనీ సార్ బాషా లాగో, బాబా లాగో, రోబో లాగో, నరసింహలాగో, ముత్తులాగో, అరుణాచలం లాగో, శివాజీలాగో, లింగాలాగో కొన్ని రోజులుంటే ఎంత బావుణ్ణు. సమాజంలో ఎన్ని వ్యవస్థలు ఆదరాబాదరాగా ప్రక్షాళనై పోయేవి? స్వచ్ఛభారత్ ఎంత తొందరగా సాధ్యమై పోయేది? అనిపిస్తుంటుంది నాకు.
 
 ఈయన మరీ డౌన్ టు ఎర్త్ - పాత్ర ఎత్తు ఆకాశమంత హైగా ఉంటుంది. ప్యాకప్ చెప్పగానే మనిషి పాతాళమంత లోతైన భావజాలంతో ఒదిగిపోయి ఉంటాడు. చాలా రోజులు ఆయన్ని ఆయన చూసుకోవడం వల్ల కలిగిన ఇన్‌సెక్యూరిటీ కారణం అనుకునే వాణ్ణి. కానీ కాదు. ఏ ప్రభావమూ తనపైన పడలేని, పడనీయని యోగ స్థితి అది. సినిమాయే జీవితంగా చెన్నై వచ్చిన బస్ కండక్టర్... సీఎమ్ కాన్వాయ్ వస్తుందని తనని ఇంటికెళ్లనీయకపోతే, కారు దిగి, సీఎమ్‌కే ట్రాఫిక్ జామ్ రుచి చూపించిన సూపర్‌స్టార్.
 
 ఒకటి అసలు - ఒకటి నకిలీ. నకిలీని అసలనుకుని భ్రమ పడకుండా, అసలుని నకిలీగా భావించకుండా - ఏ మకిలీ అంటని స్వచ్ఛతని మనసులోను, మెదడులోను, మాటలోను, నడవడిలోను, నిజాయతీలోను నింపుకున్న వ్యక్తి రజనీ మాత్రమే. అందుకే ఆయనలో అంత వెలుగు. అందుకే ఆయన్ని చూసిన ప్రేక్షకుడి కళ్లల్లో మరింత వెలుగు.
 సింప్లిసిటీ ఈజ్ ద అల్టిమేట్ రిచ్‌నెస్ - అంటే, రజనీకాంత్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. ఎందుకంటే ఆయన అంత సింపుల్. అలాగే ఆయన ఎన్నో మంచి లక్షణాలకి శాంపిల్. మరెన్నో రుగ్మతలకి పిల్. అశావహ దృక్ఫథం మనిషికి ఆక్సిజన్ లాంటిది. రజనీకాంత్ ఆ ఆక్సిజన్. రజనీ కాంత్ ఒక రెడ్ బుల్.
 
 రజనీకాంత్‌ని విశ్లేషించలేము. విసుగొచ్చేదాకా విశేషణాలతో పొగడగలము. జీసస్, బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి... వీళ్లందరినీ మానవుల రూపంలో ఉన్న దేవుళ్లుగా కొలుస్తాం. ఇలాంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకునే అవకాశం తర్వాతి తరంలో ఎవరికైనా ఉంటే అది రజనీ సార్‌కే. కమర్షియల్ సినిమా నుంచి ఈ స్థితి సాధించడం మరీ కష్టమైన విషయం. ఆయనకి అందరు హీరోలకీ ఉన్నట్టు ఫ్యాన్స్ లేరు. చాలామంది దేవుళ్లకున్నట్టు భక్తులున్నారు. ఆయనకి గుడి లేదు.
 
 కటౌట్లకి పాలాభిషేకాలు, రక్తంతో తిలకాలూ లేవు. ధార్మిక సేవా కార్యక్రమాలున్నాయి. ఆయనకి పబ్లిసిటీ లేదు. ఆయన వెనకే పబ్లిక్ ఉన్నారు. ఆయనకి రాజకీయాలు తెలీదు. రాజకీయాల్లో ఆయనున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టగలరు, నిలబెట్టగలరు. కానీ దాని జోలికెళ్లరు. డబ్బు సంపాదించాక పక్క వ్యాపారాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్న ఎంతోమంది స్టార్లున్నారు. కానీ ఆయన ఏ ఐపిఎల్ టీమ్‌కీ ఫ్రాంఛైజీ కాదు. ఏ వ్యాపారానికీ అధినేత కాదు. ఆయనకి స్కీముల్లేవు. అందుకే ఏ స్కాముల్లోనూ లేరు. ఆయనకి ఈ రోజు ఎలా బతకాలో తెలుసు. నిన్న తనేమిటో గుర్తు. రేపటి గురించిన ఆలోచన లేదు. అందుకే అంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. తన మీద, తన వయసు మీద తనే జోకులేసుకోగలుగుతున్నారు. నటనే జీవితమయ్యాక కూడా, జీవితంలో నటించకుండా ఉండగలుగుతున్నారు.
 
 రజనీ ఒక స్ఫూర్తి పాఠం. రజనీ ఒక అతీత శక్తి. రజనీ ఒక జనాకర్షణ యంత్రం. రజనీ ఒక తారకమంత్రం. మనిషి నుంచి మనీషిగా మారే ప్రయాణం రజనీకాంత్.  గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే వాడు. రజనీకాంత్ అంటే చీకటిలో వెలుగు నింపేవాడు. అందుకే రజనీకాంత్ - ఒక గురువు. ప్రతి మనిషీ బ్రతకడానికి నేర్చుకోవలసిన తప్పనిసరి పాఠం రజనీకాంత్. ఈ పాఠం చదువుతున్నా, విన్నా, వెండితెర మీద చూసినా ఆనందం. తాదాత్మ్యం. దటీజ్ రజనీ సర్. లాంగ్ లివ్ రజనీ సర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సర్.
 
 మీ...వి.ఎన్. ఆదిత్య దర్శకుడు