నేను లవ్ గురూని..!

11 Apr, 2014 02:30 IST|Sakshi
నేను లవ్ గురూని..!

‘‘ఇందులో నేను లవ్‌గురుగా కనిపిస్తాను. చిలిపి సరదాల దృశ్యరూపంగా అనిపించే అల్లరి ప్రేమికుల కథ ఇది’’ అని శ్రీ అన్నారు. కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ, హరిప్రియ జంటగా డి.రాజేంద్రప్రసాద్‌వర్మ నిర్మించిన చిత్రం ‘గలాట’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో ముచ్చటించారు.

‘కొత్త దర్శకులతో ఇక చేయకూడదు అనుకున్నాను. కానీ... అద్భుతమైన కథ చెప్పి నన్ను ఒప్పించాడు దర్శకుడు కృష్ణ. ఎంత బాగా చెప్పాడో, అంతకు తగ్గ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడు. బామ్మకు నచ్చే లక్షణాలున్న అమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఓ అమ్మాయి గుళ్లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ మంత్రి వల్ల సమస్యల్లో పడిన ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడి, తనదాన్ని చేసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం.
 
కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. జంధ్యాలగారి సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ శ్రావ్యమైన బాణీలిచ్చారని, కృష్ణ నటించిన ‘గూఢచారి 116’లోని ‘నువ్వునా ముందుంటే..’ పాటను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా పెట్టామని శ్రీ తెలిపారు. ‘ఈ రోజుల్లో, బస్టాప్’ చిత్రాలకు పనిచేసిన కిరణ్ దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ చిత్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు.