జీవాతో జత కుదిరింది!

2 Dec, 2018 09:07 IST|Sakshi

జీవాతో నటి మంజిమామోహన్‌కు జత కుదిరింది. ‘అచ్చం ఎంబదు మడమయడా’ చిత్రంలో శింబుతో కలిసి కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్‌ బ్యూటీ మంజిమామోహన్‌. ఈ తరువాత రెండు మూడు చిత్రాల్లో నటించినా ఈ అమ్మడి కెరీర్‌ ఇక్కడ వేగం పుంజుకోలేదనే చెప్పాలి. అయితే మాతృభాషతో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటిస్తున్న మంజిమామోహన్‌ తాజాగా ఒక మల్టీస్టారర్‌ చిత్రంలో నటించే అవకాశం వరించింది.

యువ నటులు జీవా, అరుళ్‌నిధి కలిసి నటించనున్న చిత్రంలో ఈ బ్యూటీ నటించనుంది. దీనికి రాజశేఖర్‌ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని  సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై నటుడు జిత్తన్‌ రమేశ్‌ నిర్మించనున్నారు. ఈ క్రేజీ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మాప్పిళై సింగం చిత్ర ఫేమ్‌ రాజశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపారు.

ఇది స్నేహం ఇతివృత్తంగా తెర పై ఆవిష్కరించనున్న కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు తమ సంస్థలో విజయ్‌ హీరోగా స్నేహం నేపథ్యంలో ఫ్రెండ్స్‌ చిత్రాన్ని నిర్మించామని, ఇది ఆ తరహాలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇందులో జీవాకు జంటగా నటి మంజిమామోహన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అరుళ్‌నిధి సరసన నటించే నటి ఎంపిక జరుగుతోందని అన్నారు.

చిత్రాన్ని డిసెంబర్‌ 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందులో మీరు కూడా నటిస్తున్నారా అన్న ప్రశ్నకు తాను ప్రొడక్షన్‌నే చూసుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని, అభినందన్‌ ఛాయాగ్రహణం అందించనున్నారు. కాగా ప్రస్తుతం జీవా గొరిల్లా, జిప్సీ చిత్రాలను పూర్తి చేసి కీ చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా అరుళ్‌నిధి పుహళేంది ఉనుమ్‌ నాన్‌ చిత్రంతో పాటు భారత్‌ నీలకంఠన్‌ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ఇక నటి మంజిమామోహన్‌ దేవరాట్టం చిత్రంలో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా