సందడే సందడి!

14 Jan, 2015 23:06 IST|Sakshi

ముంగిట్లో ముగ్గులు.. కన్నెపిల్ల సిగ్గులు... నింగికెగసే పతంగులు...
 కొత్త పంటతో నిండిన ధాన్యపు గాదెలు...  కొత్తల్లుళ్ల సరదాలు...
 కోడిపందాల జోరులు... గంగిరెద్దుల సందళ్లు... హరిదాసుల కీర్తనలు...  
 నోరూరించే గారెలూ బూరెలూ... నవకాయ పిండివంటలు...
 అవును... సంక్రాంతి అంటేనే... సంపూర్ణమైన క్రాంతి. తెలుగు పండగల్లో రారాజు ఇది.
 ఈ సంక్రాంతి గురించి ముఖ్యంగా, ముగ్గుల గురించి
 మన తెలుగు తెర ముద్దుగుమ్మలు చెప్పిన ముచ్చట్లు...

 
 పతంగులెగరేస్తూ...  
 తమిళ చిత్రం ‘మాపిళ్లయ్ సింగమ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. పండగ పూట పని చేయడం ఒకింత ఇబ్బందిగానే ఉన్నా.. ఈ రోజు కూడా చేతి నిండా పని ఉన్నందుకు ఆనందంగా ఉంది. మామూలుగా చిన్నప్పుడు పండగలను ఎంజాయ్ చేసేదాన్ని. నాకు ముగ్గులు వేయడం రాదు. ఎవరితో అయినా పెద్ద ముగ్గులు వేయించి, వాటిని రంగు పొడులతో ఆకర్షణీయంగా చేసి, ఆనందపడుతుంటాను. గాలిపటాలు ఇష్టమే కానీ, ఎప్పుడూ పోటీపడి ఎగరేసింది లేదు. ఏవో చిన్న చిన్న గాలిపటాలెగరేసేదాన్ని.
 - అంజలి