750 ఫోన్ నంబర్ల నుంచి వేధింపులు

15 Jan, 2015 03:30 IST|Sakshi
750 ఫోన్ నంబర్ల నుంచి వేధింపులు

పాట్నా: ప్రేమించాలంటూ గత ఆరేళ్లుగా ఫోన్ లో వేధిస్తున్న వ్యక్తిపై బీహార్ కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. గత ఆరేళ్లలో 750 మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించాడని బాధితురాలు మహిళా హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది.

అతడి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసినా కొత్త నంబర్ల నుంచి ఫోన్లు చేసేవాడని ఆమె తెలిపింది. బ్లాక్ చేసిన ప్రతిసారీ ఫోన్ నంబర్లు మార్చేసే వాడని వాపోయింది. వేధింపులకు గురిచేసిన వ్యక్తి బాధితురాలి క్లాస్ మేటే. నిందితుడు 750 ఫోన్ నంబర్లు వినియోగించినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో తేలిందని మహిళా హెల్ప్ లైన్ అధికారి ప్రమీలా కుమారి తెలిపారు.

చివరికి అతడి ఫోన్ నంబర్ కనిపెట్టి, బాధితురాలిని కలిసేందుకు రావాలని కబురు పెట్టారు. భవిష్యత్ లో మళ్లీ వేధింపులకు దిగితే చర్య తప్పదని హెచ్చరించారు. ఇంకెప్పుడూ ఆమెకు ఫోన్ చేయనని, ఫోన్ నంబర్ మార్చనని అతడితో లేఖ రాయించినట్టు కుమారి తెలిపారు.

మరిన్ని వార్తలు