డైరెక్టర్ నాలుకపై కోటి రూపాయల నజరానా!

22 Nov, 2016 22:56 IST|Sakshi
డైరెక్టర్ నాలుకపై కోటి రూపాయల నజరానా!

బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ప్రాజెక్టులలో 'టాయిలెట్-ఎక్ ప్రేమ్ కథా' ఒకటి. కొన్ని రోజుల కిందట షూటింగ్ మొదటిరోజు టాయిలెట్‌లో హీరోయిన్ భూమి పెడ్నేకర్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని అక్షయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా హల్ చల్ చేసింది. ఆ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి వివాదంతో ముందుకొచ్చింది. సాధువు బెహరీ దాస్ మహరాజ్ ఈ మూవీ డైరెక్టర్ నీరజ్ పాండే నాలుక తెచ్చిన వారికి ఏకంగా కోటి రూపాయల నజరానా ప్రకటించారు.

ఆ వివరాలిలా ఉన్నాయి.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలు, కొన్ని ఏరియాలలో ఇవి లేని కారణంగా ఏకంగా వివాహాలు రద్దయిన విషయం తెలిసిందే. మధుర పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే నందగావ్ పురుషులకు, బర్సానా గ్రామ మహిళలకు వివాహాలు జరగవు. శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ప్రేయసి రాధకి వివాహం కాలేదని, ప్రస్తుతం ఈ మూవీలో హీరోహీరోయిన్లు ఆ గ్రామాల వారైనందున స్టోరీని మార్చాలని బెహరీ దాస్ మహరాజ్ తో పాటు మరికొందరు సాధువులు హెచ్చరించారు. మూవీ స్టోరీని మార్చితీరాల్సిందేనని మూవీ యూనిట్‌ను డిమాండ్ చేస్తున్నారు.

మహామండలేశ్వర్ నవల్ గిరి మహరాజ్ మధురలో మాట్లాడుతూ.. సమాజానికి సందేశాన్నిచ్చే స్టోరీ అయితే ఆ మూవీ పేరును 'టాయిలెట్- ఏ స్వచ్ఛ అభియాన్' అని మార్చుకోవాలని అన్నారు. రాధాకృష్ణుల పుట్టి పెరిగిన ప్రాంతాల్లో సినిమా తీస్తూ, పెళ్లి లాంటి విషయాలను టచ్ చేశారని మహంత్ హరిబోల్ మహరాజ్ అన్నారు. టైటిల్ కచ్చితంగా మార్చితీరితేనే నందగావ్, బర్సానా, మధుర ప్రాంతాల్లో షూటింగ్ సజావుగా సాగనిస్తామని సాధువులంతా సోమవారం మధురలో జరిగిన ఓ సమావేశంలో నిర్ణయించారు. ఆ మూవీకి డైరెక్టర్ నీరజ్ పాండే కాగా నిర్మాతలుగా విక్రమ్ మల్హోత్రా, శీతల్ భాటియా, నీరజ్ పాండే వ్యవహరిస్తున్నారు.