మూడు నెలల్లో సస్పెండ్ చేయాలి

17 Jul, 2016 15:07 IST|Sakshi
మూడు నెలల్లో సస్పెండ్ చేయాలి

న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వైఎస్ఆర్ సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ మూడు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, పార్టీ మారిన సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే మూడు నెలల్లో సస్పెండ్ చేయాలని మేకపాటి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు ప్రజాస్వామ్యానికి మచ్చని, చట్టాన్ని సవరించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని అన్నారు.

ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణకు సంబంధించి రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు పెడతారని మేకపాటి తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను కేంద్ర అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంతో పాటు విశాఖ-చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని విన్నవించారు. ఎంపీ లాడ్స్ నిధులను పెంచాలని మేకపాటి కోరారు.