మిస్టర్‌ బాడీబిల్డర్‌

12 Sep, 2017 10:11 IST|Sakshi
మిస్టర్‌ బాడీబిల్డర్‌
 • ఐదు పదుల వయసులోను తరగని ఉత్సాహం
 • త్వరలో రెండు అంతర్జాతీయ పోటీలకు పయనం
 • స్వయంకృషికి నిదర్శనం.. కోలారు రవి

 • కోలారు జిల్లాలో నిత్యం కరువు ఉన్నా చదువులు, ఆటలు తదితర అనేక రంగాల్లో ప్రతిభావంతులకు మాత్రం కొదవ లేదు. అలాంటి కోవకు చెందిన వారే కోలారు నగరానికి చెందిన అంచె వెంకటరమణప్ప రవి ( ఏ వి రవి). 52 యేళ్ల వయసులో కూడా ఆయన త్వరలో జరగబోయే మిస్టర్‌ ఒలింపియా (అమెరికా), మిస్టర్‌ ఆసియా (ఫిలిప్పీన్స్) పోటీలకు భారత దేశ ప్రతినిధిగా ఎంపిక కావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పాలి. పేద కుటుంబంలో పుట్టినా స్వయంకృషితో వివిధ రంగాల్లో ఎదగడం విశేషం.

  కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రవికి బాడీబిల్డింగ్‌ అంటే చిన్నప్పటి నుంచే ఎక్కడ లేని ఆసక్తి. ఆయన బెంగుళూరులో జిమ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఏకలవ్య శిక్షణతో స్వయం శక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. పేదరికంలో  ఉన్నా అంది వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు. నాడు కోలారులో ఎలాంటి అధునాతన జిమ్‌లు లేకున్నా నగరంలోని గరడి వ్యాయామశాలలోనే ప్రాక్టీస్‌ చేస్తూ తన శరీరాన్ని ఉక్కులాగా మలుచుకున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం బాడి బిల్డింగ్‌ పై మక్కువ చూపిన రవి వెనక్కు తిరిగి చూడలేదు.

  తొలుత బెంగుళూరు విశ్వ విద్యాలయంలో మిస్టర్‌ బెంగుళూరుగా ఎన్నికై తరువాత  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సొంతం చేసుకుని ఇంతవరకు 108 పథకాలను సాధించారు. తాను పాల్గొన్న ఏ పోటీలోను ఓటమి ఎదురు కాలేదని గర్వంగా చెబుతారు రవి. అనంతరం  మిస్టర్‌ ఆసియా పోటీలో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా విధులు నిర్వహించి ఆసియా ఛాంపియన్ షిప్‌ను సాధించారు. 2016లో బెస్ట్‌ కోచ్‌ అవార్డును కూడా అందుకున్నారు.

  సినిమాలలో నటన
  రవి ఇంతవరకు తెలుగు, తమిళ, కన్నడలో దాదాపు 128 కి పైగా సినిమాల్లో నటించారు. మెగాస్టార్‌ చిరంజీవి  కుటుంబ సభ్యులకు బాడీబిల్డింగ్‌ కోచ్‌గా కూడా పనిచేశారు.

  అవార్డులు అనేకం
  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు, స్టేట్‌ బెస్ట్‌ స్పోర్ట్స్‌ మెన్ అవార్డు, దసరా అవార్డు, కెంపేగౌడ అవార్డులను రవి అందుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు భారత శ్రేష్ట అవార్డు, భారతశ్రీ అవార్డు, భారత్‌కుమార్‌ అవార్డు, భారత కిశోర్‌ అవార్డు, దక్షిణ్‌ భారత్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.  

  ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది: రవి
  నిత్యం 8 గంటల వ్యాయామం చేస్తున్న రవి తాను డ్రగ్స్‌ వాడకానికి వ్యతిరేకమని అంటున్నారు. సహజ సిద్దమైన శాఖాహారం ద్వారానే ఉత్తమ ఆరోగ్యంతో దేహధారుఢ్యం కలిగి ఉండవచ్చునని చెబుతున్నారు. క్రీడా విభాగం లో ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం లభించడం మినహాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం లేదని రవి అంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే బాడీ బిల్డింగ్‌ అకాడమిని స్థాపించి ఎంతో మందిని తయారు చేయవచ్చునని అంటున్నారు.