నా ధైర్యం ఆ ఇద్దరే

29 Jan, 2018 01:10 IST|Sakshi
దీపికా పదుకోన్‌

‘పద్మావత్‌’ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు గురించి తెలిసిందే. విడుదలకు ముందు, ఆ తర్వాత ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు. దీపికా పదుకోన్‌ పై దాడులు చేస్తామని కొందరు, చెవి, ముక్కు నరికి తెస్తే నగదు బహుమతి ఇస్తామని మరికొందరు బహిరంగంగా పేర్కొన్న విషయమూ విదితమే. ఈ బెదిరింపులను దీపికా పదుకోన్‌ ఎలా ఎదుర్కొని నిలబడగలుగుతున్నారు అనే సందేహం కలగవచ్చు. దానికి  కారణం మా పేరెంట్స్‌ నన్ను పెంచిన విధానమే అంటున్నారు దీపికా పదుకోన్‌.

‘‘ఈ వివాదాలు జరిగిన అన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మా పేరెంట్స్‌ ‘నీ దగ్గరకు వచ్చి ఉంటాం’ అనలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు.. నేను ఈ సిచ్యువేషన్స్‌ను హ్యాండిల్‌ చేయగలనని. సమస్యలను మా అంతట మేం డీల్‌ చేసుకొనేలా నన్ను, నా చెల్లెల్ని (అనీషా పదుకోన్‌) మా పేరెంట్స్‌ పెంచారు. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవటం నేర్పించారు మా తల్లిదండ్రులు. మా ధైర్యం ఆ ఇద్దరే’’ అని చెప్పారు దీపికా పదుకోన్‌.

‘పద్మావత్‌’ చూశాక తన తల్లిదండ్రులు ఎలా స్పందించారనే విషయం గురించి చెబుతూ – ‘‘ఈ సినిమా చూసి చాలా గర్వంగా ఫీల్‌ అయ్యారు. సినిమా చూసిన వెంటనే నాకు వీడియో కాల్‌ చేశారు. వాళ్ల ముఖాలు గర్వంతో వెలిగిపోవటం నాకు కనిపించింది. వాళ్లు వీడియో కాల్‌ చేసేటప్పటికి నేను పైజామాలో ఉన్నాను. సినిమాలో రాణీ పద్మావతిగా చూసి, మళ్లీ మాములుగా చూసేసరికి ఈ అమ్మాయినేనా మేము స్క్రీన్‌ పై అంత అద్భుతంగా చూసింది అనే ఆశ్చరం కనిపించింది అమ్మానాన్న కళ్లలో’’ అని పేర్కొన్నారు దీపికా.

మరిన్ని వార్తలు