ధనుష్ చిత్రంలో నదియ

9 Sep, 2016 02:40 IST|Sakshi
ధనుష్ చిత్రంలో నదియ

నటుడు ధనుష్ చిత్రంలో నటి నదియ ప్రధాన పాత్ర పోషించనున్నారన్నది తాజా సమాచారం. నటుడు ధనుష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత గాయకుడిగా, గీతరచయితగా, నిర్మాతగా తనను తాను మలచుకుంటూ ఎదిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్. ఆయన చాలా కాలంగా తనలో అణుచుకుంటూ వచ్చిన దర్శకత్వం కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తాను కథ తయారు చేసుకుని దర్శకత్వం బాధ్యతలను చేపట్టిన చిత్రానికి ఇటీవల పూజాకార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు.
 
 సీనియర్ నటుడు రాజ్‌కిరణ్‌ను కథానాయకుడిగా ఎంచుకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి పవర్‌పాండి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ధనుష్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఈ విషయం గురించి వెల్లడించకపోవడం గమనార్హం. ఇందులో రాజ్‌కిరణ్‌కు భార్యగా ప్రధాన పాత్రలో నదియ నటించనున్నారని తెలిసింది. 1980లో కథానాయకిగా ఓ వెలుగు వెలిగిన నదియ 1994లో పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. హీరోయిన్‌గా ఆమె నటించిన చివరి చిత్రం ప్రభుకు జంటగా నటించిన రాజకుమారన్. వివాహానంతరం భర్త సహా అమెరికాలో మకాం పెట్టిన నదియ అనూహ్యంగా 2004లో నటిగా రీఎంట్రీ అయ్యారు.
 
 జయంరవి నటించిన ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రంలో ఆయనకు అమ్మగా నటించారు. ఆ చిత్రం విజయంతో నదియాకు వరుసగా తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. ధనుష్ తన తండ్రి కస్తూరిరాజా దర్శకత్వం వహించిన ఎన్ రాసావిన్ మనసులో చిత్రంలో రాజ్‌కిరణ్‌కు జంటగా నటించిన నటి మీనానే తన చిత్రంలోనూ ఆయనకు జంటగా నటింపజేయాలని మొదట భావించారట. అయితే ప్రస్తుతం మీనా కంటే నదియాకే మంచి మార్కెట్ ఉందనే గణంకాల కారణంగా నదియానే ఎంపిక చేశారని సమాచారం.కాగా ఇందులో నటి చాయాసింగ్. నటుడు ప్రసన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్యాన్‌రోల్ సంగీతాన్ని అందుస్తున్నారు.