మహేశ్‌కి పోటీ లేదు!

11 May, 2014 22:48 IST|Sakshi
మహేశ్‌కి పోటీ లేదు!

‘‘మాతృత్వం ఓ తీయని అనుభూతి. ఆ అనుభూతిని ప్రపంచంలో వేరే ఏదీ ఇవ్వలేదు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు... ఇవేవీ ఇవ్వనంత ఆనందాన్ని బిడ్డలిస్తారు. అసలీ ఆనందం ముందు తక్కినవన్నీ పేలవంగానే అనిపిస్తాయి’’ అని ఎంతో మురిపెంగా చెప్పారు నమ్రతా మహేశ్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు ప్రస్తావించారు. తన భర్త మహేశ్‌బాబు గురించి చెబుతూ - ‘‘నేను తనకు అభిమానిని. ప్రస్తుతం పరిశ్రమలో తనంత ప్రతిభ ఉన్నవాళ్లు కానీ తనకన్నా మెరుగైనవాళ్లు కానీ లేరని నా ఫీలింగ్. మహేశ్ ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మొదట్లో తన తండ్రి సపోర్ట్ బాగా ఉపయోగపడింది.
 
 ఆ తర్వాత తనంతట తానుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. మంచో, చెడో.. ఏ నిర్ణయమైనా నేనే తీసుకుంటానని మహేశ్ నిర్మొహమాటంగా చెబుతాడు. కానీ, మహేశ్ విషయంలో నా జోక్యం ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. నేనెప్పుడూ పర్సనల్‌గా స్టూడియోలో కూర్చుని ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఏ లుక్ అయితే బాగుంటుంది? ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి? లాంటి విషయాల గురించి చర్చించను. చిన్న చిన్న సలహాలు మాత్రమే ఇస్తాను. మహేశ్ బిడియస్తుడు. షూటింగ్ లొకేషన్‌కి ఫోన్ తీసుకెళ్లడు. తననెవరైనా కాంటాక్ట్ చేయాలంటే నాకు ఫోన్ చేస్తారు.
 
 దానివల్ల తనకు సంబంధించిన అన్నింట్లోనూ నా జోక్యం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. సినిమాలపరంగా నిర్ణయాలన్నీ తనవే. సొంత నిర్ణయాలు తీసుకునే ఈ స్థాయికి ఎదిగాడు. మహేశ్‌కి పోటీ లేదు. తన సమకాలీనులందరికన్నా పై స్థాయిలోనే ఉన్నాడు. తనను నేను పెళ్లి చేసుకున్నప్పుడు తనే బెస్ట్ అనుకున్నాను. అప్పట్లో తనకన్నా మంచి స్థాయిలో ఉన్నవాళ్లున్నప్పటికీ నాకు అలానే అనిపించింది’’ అన్నారు. పలు ప్రముఖ ఉత్పత్తులకు మహేశ్‌బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో మాత్రం తన జోక్యం మెండుగానే ఉంటుందని, అది కూడా మహేశ్ ఇష్టప్రకారమేనని స్పష్టం చేశారు నమ్రత.