కొత్త దర్శకుడితో నాని

19 Nov, 2016 15:40 IST|Sakshi
కొత్త దర్శకుడితో నాని

ప్రస్తుతం యంగ్ హీరో నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలను రిలీజ్ చేసిన ఈ యంగ్ హీరో మరో సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉన్న ఈ నేచురల్ స్టార్ ముందు ముందు కూడా అదే ఫాంను కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా తన ఇమేజ్ను కాపాడు కుంటూనే కొత్త దర్శకులతో సినిమాలకు సై అంటున్నాడు.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న నేనులోకల్ సినిమాలో నటిస్తున్న నాని, ఈ సినిమా తరువాత ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేయనున్నాడు. టీచింగ్ ఫీల్డ్ నుంచి దర్శకుడిగా మారుతున్న శివ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా రచయిత కోన వెంకట్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నాని సరసన జెంటిల్మన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నివేదా థామస్ మరోసారి నానితో జతకడుతుండగా, సరైనోడు సినిమాలో నెగెటివ్ రోల్తో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం ఫారిన్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.