అద్భుతాలు సృష్టించగలుగుతారు!

18 Nov, 2014 22:39 IST|Sakshi
అద్భుతాలు సృష్టించగలుగుతారు!

‘‘ ‘పేరుకే ఇందరు జనం.. పేరుకు పోయిన ఒంటరితనం.. నరనరాన పిరికితనం.. అందుకు జవాబే మనం’... ఈ సినిమా కోసం సిరివెన్నెల రాసిన ఈ అక్షరాలే మా సినిమా కథ. ఇందులో నేను డబ్బున్న ఇగోయిస్ట్ ఎస్సైగా నటించాను. ‘నేను’ అనే తత్వం నుంచి ‘మనం’ అనే తత్వం వైపు ఓ మనిషి ఎలా నడిచాడు? అనే ప్రశ్నకు సమాధానమే ‘రౌడీ ఫెలో’లో నా పాత్ర. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని నారా రోహిత్ చెప్పారు. ఆయన కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘రౌడీ ఫెలో’. రచయిత కృష్ణచైతన్య ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ప్రకాశ్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది.
 
 కృష్ణచైతన్య మాట్లాడుతూ -‘‘జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ‘మనుషులే కనిపిస్తున్నారు... మానవత్వం కాదు’ అన్న పాయింట్ ఆధారంగా తీసుకొని ఈ కథ తయారు చేశాను. ప్రతి మనిషికీ అహం అవసరం. అయితే... అది ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అద్భుతాలు సృష్టించగలుగుతారు. రామరావణ సంగ్రామం, కురుక్షేత్ర యుద్ధం స్త్రీల కారణంగా జరిగాయని చెబుతుంటారు. కానీ నా దృష్టిలో అవి జరగడానికి కారణం ఇగో ప్రాబ్లమ్సే. ఇందులో హీరో పాత్ర ఈ విషయాన్నే చెబుతుంది. రోహిత్ కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా అవుతుంది. కథానాయిక విశాఖ సింగ్ రంగస్థల నటి కావడం వల్ల అద్భుతంగా నటించింది’’ అని తెలిపారు. ఇంత మంచి సినిమాలో తానూ భాగం అయినందుకు ఆనందంగా ఉందని విశాఖ సింగ్ అన్నారు.