ఒకే దెబ్బ.. రెండు పిట్టలు! | Sakshi
Sakshi News home page

ఒకే దెబ్బ.. రెండు పిట్టలు!

Published Tue, Nov 18 2014 10:38 PM

ఒకే దెబ్బ.. రెండు పిట్టలు! - Sakshi

సాక్షి, ముంబై:  ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తనదైన శైలిలో రాష్ట్ర రాజకీయాలకు తెర తీశారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడి చందంగా బీజేపీ, శివసేనలను ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి మంగళవారం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండురోజుల పాటు జరగనున్న ఆ పార్టీ సమావేశాలను శరద్‌పవార్ మంగళవారం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా రాష్ట్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాధించలేదని, దీంతో రాష్ట్రంలో తొందర్లోనే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఎత్తుగడ  దాగి ఉందనే కోణంలో అప్పుడే రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు మొదలుపెట్టారు.

 ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన మరో కూటమిగా ఎన్నికల్లో పోటీచేస్తూ వచ్చాయి. కాగా, మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలూ సీట్ల సర్దుబాటు కాక ఒంటరిగానే పోటీకి దిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ (122) అతి ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో శివసేన(63), కాంగ్రెస్(41), ఎన్సీపీ(40) నిలిచాయి. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీకి భేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎన్సీపీ ప్రకటించింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీ మద్దతు తీసుకోవడంపై వ్యతిరేకత రావడంతో బీజేపీ కొంత వెనక్కు తగ్గింది. తర్వాత మద్దతు కోసం శివసేనతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది.

 అయితే ఈ రెండు పార్టీల మధ్య కొంతవరకు సానుకూలంగా చర్చలు జరిగినా, మంత్రిత్వశాఖల కేటాయింపుల్లో తేడాల వల్ల అవి ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే గత 12వ తేదీన బీజేపీ సర్కార్ మైనారిటీ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై శివసేన మండిపడుతూ.. ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. అలాగే తమ మంత్రులపై ఉన్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే బీజేపీ సర్కార్‌కు ఎన్సీపీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆరోపించింది. అయితే ‘బలపరీక్ష’ సమయంలో బీజేపీ మూజివాణి ఓటు ద్వారా బలపరీక్షను నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.

ఈ మొత్తం తతంగంలో ఎన్సీపీ చాలా తెలివిగా వ్యవహరించింది. బలపరీక్ష సమయంలో బీజేపీతో శివసేన పొత్తు కుదుర్చుకునేందుకు అవకాశాలు తగ్గిస్తూ, తమ పార్టీ బీజేపీకి భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పదేపదే ప్రకటించింది. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్వయంగా కూడా ఇటువంటి ప్రకటనలు చేయడం విశేషం. దీని దెబ్బతో శివసేన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బీజేపీ మూజువాణి ఓటుతో గట్టెక్కి కొంత అపవాదును మూటగట్టుకుంది. ఈ పరంపరలో బీజేపీ, శివసేనల పైన ఒత్తిడి పెంచేందుకే ఇప్పుడు ‘పవార్’ గేమ్ ప్రారంభించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 ఇదిలా ఉండగా, ఇదే సమయంలో తమ గత ప్రభుత్వంలో తమ మంత్రులు అవినీతికి పాల్పడలేదని, అవసరమైతే ఎటువంటి సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని పేర్కొనడం విశేషం. అలాగే బీజేపీకి శివసేనతో జతకట్టే పరిస్థితి లేదని, అదే సమయంలో తమ మద్దతు తీసుకునే ధైర్యమూ లేదని వ్యాఖ్యానించడం ఫడ్నవిస్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడం కిందేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేన ప్రతిపక్షంలో ఉంది. ఆరు నెలల తర్వాత తిరిగి జరిగే బలపరీక్షలో బీజేపీ సర్కార్‌కు కాంగ్రెస్, ఎన్సీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. అలా కాకుండా, బీజేపీ సర్కారు మనుగడ సాధించాలంటే తమ పాత్ర చాలా కీలకమనే భావన ఆ పార్టీలో కలగజేసేందుకే పవార్ ఈ ఎత్తుగడ వేశారని చెప్పవచ్చు.   

 ప్రభుత్వ మనుగడ శివసేనపై ఆధారం...?
 తొలిసారిగా ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం మనుగడ శివసేన నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్టయితే రాష్ట్రంతోపాటు కేంద్ర రాజకీయాల్లో బీజేపీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిరానుంది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారాన్ని కాపాడుకునేందుకు శివసేన మద్దతు మినహా బీజేపీ వద్ద మరో ప్రత్యామ్నామం లేదు.  దీంతో శివసేనకు అవసరమైతే ఉపముఖ్యమంత్రి పదవితోపాటు కేబినెట్‌లో మంత్రి పదవులు ఇచ్చే ఆస్కారముంది. ఇదిలా ఉండగా, ప్రత్యేక విదర్భకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతులుకలిపేందుకు సిద్ధమవుతారా అనేది వేచిచూడాల్సిందే.

Advertisement
Advertisement