చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

28 Jul, 2019 06:01 IST|Sakshi
నారాయణ్‌దాస్‌ నారంగ్‌

శనివారం హైదరాబాద్‌లో చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎగ్జిబిటర్‌ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్, స్టూడియో ఓనర్స్‌ సెక్టార్, నిర్మాతల మండలి.. ఇలా నాలుగు విభాగాలుంటాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో విభాగం నుండి ఒకర్ని అధ్యక్షునిగా ఎంపిక చేస్తారు. ఈసారి ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ తరఫున ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ్‌దాస్‌ నారంగ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల కోసం  సి.కల్యాణ్‌ ఆధ్వర్యంలో ‘మన ప్యానెల్‌’, ‘దిల్‌’ రాజు సారధ్యంలోని ‘యాక్టివ్‌ ప్రొడ్యూసర్‌ ప్యానెల్‌’ పోటీ పడ్డాయి.

‘మన ప్యానెల్‌’ నుండి తొమ్మిది మంది విజయం సాధిస్తే యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ ప్యానెల్‌ నుండి ఇద్దరు విజయం సాధించారు. మోహన్‌గౌడ్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విజయం సాదించారు. ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాసు, ‘దిల్‌’ రాజు, కొల్లి రామకృష్ణ, కార్యదర్శులుగా  దామోదర్‌ ప్రసాద్, ముత్యాల రమేశ్, సహాయ కార్యదర్శులుగా భరత్‌ చౌదరి, నట్టికుమార్, జి. వీరనారాయణబాబు, జె. మోహన్‌ రెడ్డి, పి. భరత్‌ భూషణ్, ఎన్‌. నాగార్జున, కోశాధికారిగా విజయేందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఇంకా నాలుగు విభాగాల్లో నిర్మాతల విభాగానికి ఏలూరు సురేందర్‌ రెడ్డి, పంపిణీ విభాగానికి ఎన్‌. వెంకట్‌ అభిషేక్, స్టూడియో విభాగానికి వై. సుప్రియ, థియేటర్‌ అధినేతల విభాగానికి టీఎస్‌ రాంప్రసాద్‌ నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు