అన్నం దొరక్క ఫుట్‌పాత్‌లపై ఏడుస్తూ నిద్రపోయి.. చేతిలో డబ్బుల్లేక అష్టకష్టాలు.. జీరో నుంచి స్టార్‌ హీరోగా..

22 Nov, 2023 17:24 IST|Sakshi

ఇష్టమైనది సాధించేవరకు ఎంతైనా కష్టపడుతుంటారు. విజయాలు అందుకోవాలంటే కష్టాలను దాటుకుని ముందుకు రావాల్సిందే! ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు పొందిన ఎంతోమంది కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు వచ్చినవారే! అందులో నటుడు మిథున్‌ చక్రవర్తి కూడా ఉన్నాడు. జీరో నుంచి హీరోగా మారిన ఇతడి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శకనీయం. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన ఇతడు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.

నన్నెవరు హీరోగా తీసుకుంటారులే
ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపేశాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుందా? నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు.. ఇలా ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో.. చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీదే నిద్రపోయాను. అయితే ఇండస్ట్రీలో నన్నెవరు హీరోగా తీసుకుంటారని అనుకునేవాడిని. అందుకే, విలన్‌ అవ్వాలనుకున్నాను.

తిండి దొరుకుతుందని పార్టీలో డ్యాన్స్‌..
అది కూడా మంచి డ్యాన్స్‌ చేయగలిగే విలన్‌గా! పని ఎక్కడ దొరికితే అక్కడికి నడుచుకుంటూ వెళ్లేవాడిని. నాలుగు మెతుకుల కోసం పార్టీలలో డ్యాన్స్‌ చేసేవాడిని' అని తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు మిథున్‌. 'నేను అనుకున్నది సాధించలేనేమోనని భయపడేవాడిని. తిరిగి కోల్‌కతాకు కూడా వెళ్లలేకపోయాను. ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నాను.

బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌
కానీ అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే.. ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి.. పోరాడండి. నేనూ ఫైట్‌ చేశాను.. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్‌ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్‌, డ్యాన్స్‌ డ్యాన్స్‌, ప్యార్‌ ఝుక్తా నహీ, కసమ్‌ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించాడు. హీరోగా  80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో 'గోపాల గోపాల' సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు.

చదవండి: మరికాసేపట్లో పెళ్లి.. హల్దీ ఫంక్షన్‌లో కాబోయే భార్యతో స్టెప్పులేసిన మానస్‌

మరిన్ని వార్తలు