భారీ అయినా సారీ!

28 Jul, 2019 03:08 IST|Sakshi

రెండు మూడు సినిమాలకు తీసుకునే పారితోషికం ఒకే సినిమాకి వస్తే? లాటరీ తగిలినట్లే. అలాంటి అవకాశాన్ని దాదాపు ఎవరూ వదులుకోరు. కానీ నయనతారలాంటి కొందరు మాత్రం ‘నో’ అనేస్తారు. ఇంతకీ నయనతార వదులుకున్న ఆ ఆఫర్‌ ఎంతో తెలుసా? పది కోట్ల రూపాయలు. ఇంత భారీ ఆఫర్‌కి సింపుల్‌గా సారీ చెప్పేశారా? అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే సినిమాల ఎంపిక విషయంలో ఈ మధ్య ఆచితూచి అడుగులేస్తున్న నయనతార బాగా ఆలోచించుకుని ఈ ఆఫర్‌ని కాదన్నారట.

తమిళంలో శరవణన్‌ అనే నూతన హీరోతో ఓ సినిమాకి ప్లాన్‌ జరుగుతోంది. ఇందులో శరవణన్‌కు జోడీగా నయనతారను నటింపజేయాలనుకున్నారట. లేడీ సూపర్‌ స్టార్‌ ట్యాగ్‌తో దూసుకెళుతున్న నయనతార కొత్త హీరోతో సినిమా అంటే ఓకే చెబుతారా? చెప్పరు కదా. అందుకే పది కోట్ల రెమ్యూనరేషన్‌ ఇస్తామంటూ ఆఫర్‌ అందించారు. అయినప్పటికీ ఆమె అంగీకరించలేదు. శరవణన్‌ కొత్త నటుడు కావడంతోనే అంగీకరించలేదని కొందరు అంటే పాత్ర çనచ్చక తిరస్కరించారని మరికొందరు అంటున్నారు. అసలు కారణం ఏంటో నయనతారకే తెలియాలి.

మరిన్ని వార్తలు