వ్యక్తిగత విషయాలు అడక్కండి

19 Jun, 2016 03:22 IST|Sakshi
వ్యక్తిగత విషయాలు అడక్కండి

నా వ్యక్తి గత జీవితం గురించి చర్చించకండి. ఆ హక్కు మీకు లేదు అని కాస్త గట్టిగానే అంటున్నారు నటి ఇలియానా. ఒకప్పుడు అగ్ర నాయకీ ఈ గోవా బ్యూటీ. ముఖ్యంగా తెలుగులో ఒక టైమ్‌లో ఏలారనే చెప్పవచ్చు. ఇక తమిళంలో చాలా డిమాండ్‌తోనే నన్భన్ చిత్రంలో విజయ్‌కి జంటగా నటించారనే ప్రచారం జరిగింది. అలాంటి నటి అనూహ్యంగా బాలీవుడ్ మోహంతో దక్షిణాది అవకాశాలను కాలదన్నుకున్నారనే వారు లేకపోలేదు. అయితే హిందీ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఇలియానా పరిస్థితి ఆశాజనకంగా లేదన్నది వాస్తవం.

దీంతో మళ్లీ  పీచేమూడ్ అంటూ దక్షిణాదిలో అవకాశాలు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఇలియానానే స్వయంగా వ్యక్తం చేశారు. అవకాశాలు వస్తే మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటించడానికి రెడీ అని పేర్కొన్నారు. అయితే తానెవరినీ అవకాశాలు అడగనని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకున్న స్నేహితులే మంచి అవకాశాలను తెచ్చి పెడతారని అన్నారు.

ఇకపోతే తాను ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రు న్యూబార్న్ అనే ఫొటోగ్రాఫర్‌ను ప్రేమిస్తున్నానని, అయితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారెందుకనీ అడుగుతున్నారన్నారు. తన ప్రేమ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు. అదే విధంగా  తన సినీ జీవితం గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చునని వ్యక్తిగత విషయాల గురించి చర్చించే హక్కు మాత్రం ఎవరికీ లేదని గట్టిగా వ్యాఖ్యానించారు.

తాను త్వరలోనే దక్షిణాది చిత్రాల్లో నటించనున్నానని ఆ చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని  ఇలియానా తెలిపారు. మొత్తం మీద ఈ అమ్మడు మళ్లీ తమిళం, తెలుగు చిత్రాలను టార్గెట్ చేస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ఇలియానా రీఎంట్రీ ఎలా ఉంటుంది. దీని ప్రభావం ఏ నటిపై పడుతుందీ అన్నది.