నేహా ధూపియా ట్వీట్లపై కలకలం

24 Jul, 2015 10:44 IST|Sakshi
నేహా ధూపియా ట్వీట్లపై కలకలం

ముంబై: బాలీవుడ్ నటి నేహా ధూపియా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. మోదీని విమర్శించే అర్హత ఆమెకు లేదంటూ ఎదురుదాడికి దిగారు.

మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంబై మహానగరం స్తంభించింది. దీనిపై నేహా ధూపియా ట్విటర్ లో స్పందించారు. 'ఒక్క వర్షానికే ముంబైలో జనజీవనం స్తంభించింది. మంచి పరిపాలన అంటే సెల్ఫీలు తీసుకోవడం, యోగా చేయడం కాదు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం పాలకుల కర్తవ్యం' అంటూ ట్వీట్ చేశారు.

మోదీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు రీట్వీట్లతో తీవ్రస్థాయిలో స్పందించారు. వార్తల్లో నిలిచేందుకు శృతి సేథ్, నేహా ధూపియా లాంటి సి-గ్రేడ్ నటీమణులు మోదీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నేహా ధూపియా ఎలాంటి సినిమాలు చేసిందో చూడాలని మరొకరు వ్యాఖ్యానించారు.

అయితే మోదీ వ్యతిరేకులు ఆమెకు బాసటగా నిలిచారు. బీజేపీ నాయకుల మాదిరిగానే మోదీ మద్దతుదారులు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

One rain n the city comes to a standstill. Good governance is not about selfies n makin us do yoga,it's making sure ur citizens r safe.