నిద్ర లేని రాత్రులు గడిపాను

29 Nov, 2019 00:22 IST|Sakshi
నిఖిల్

‘‘నేను ఇప్పటివరకూ 17 సినిమాల్లో నటించా. సినిమా విడుదల విషయంలో ఎప్పుడూ ఇబ్బందులు రాలేదు. ‘కార్తికేయ, స్వామిరారా’ సినిమాల విడుదలకు కాస్త ఆలస్యం అయింది.. అంతే. ‘అర్జున్‌ సురవరం’ సినిమా ఈ ఏడాది మే 1న విడుదల కావాల్సింది. కానీ, కొందరివల్ల విడుదల కాలేదు. అసలు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా? లేదా? అనే భయం వేసింది. ఇంటికెళ్లి ఏడ్చాను.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను’’ అన్నారు నిఖిల్‌. టి. సంతోష్‌ దర్శకత్వంలో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిఖిల్‌ చెప్పిన విశేషాలు.

► మా సినిమా బిజినెస్‌ బాగా జరిగింది. కానీ, నిర్మాతలకు, థియేటర్స్‌ ఓనర్స్‌కి మధ్య ఉండేవారు మా సినిమాని వాడేసుకున్నారు. ఈ విషయంలో నేను, నిర్మాతలు ఏమీ చేయలేకపోయాం. సమస్యలన్నీ పరిష్కరించేందుకు సమయం పట్టింది. అందుకే నేను కూడా నా పారితోషికంలో 50 శాతం మాత్రమే తీసుకున్నా. ఈ సినిమాకి లాభాలొస్తే నిర్మాతలే నాకు ఇస్తారు.

► ‘అర్జున్‌ సురవరం’లో నిజాయతీ కలిగిన అర్జున్‌ అనే జర్నలిస్ట్‌ పాత్ర చేశా. నేను, లావణ్య, ‘వెన్నెల’ కిషోర్, సత్య ఓ యంగ్‌ టీమ్‌. అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కునే మేం దాన్ని ఎలా పరిష్కరించామన్నదే ఈ చిత్రకథ. సమాజానికి సందేశంతో పాటు క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది. కొందరి చర్యల వల్ల గ్రాడ్యుయేట్స్, వారిపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు చెప్పాం. ఈ చిత్రం తమిళ సినిమాకి రీమేక్‌ అయినా కొన్ని మార్పులు చేశాం.

► ముందు మా చిత్రానికి ‘ముద్ర’ అని టైటిల్‌ అనుకున్నాం. అదే టైటిల్‌తో వేరే సినిమా విడుదలవుతోందని తెలిసి, మార్చాం. ఈ చిత్రంలో నా పేరు అర్జున్‌. సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రముఖ జర్నలిస్ట్‌. ఆయన స్ఫూర్తితో సురవరం అనే పేరు తీసుకుని ‘అర్జున్‌ సురవరం’ అని పెట్టాం. ఈ టైటిల్‌కి జనాలు బాగా కనెక్ట్‌ అయ్యారు. దర్శకుడు టి. సంతోష్‌ ఓ రాక్షసుడు. కొన్ని సీన్స్‌ని 30 నుంచి 40 టేక్‌లు కూడా చేశారు. అందుకే కొంచెం బడ్జెట్‌ కూడా ఎక్కువ అయింది. వాళ్ల నాన్నగారు జర్నలిస్టు. అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది.

► నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు హరిహర కళాభవన్‌లో స్కూల్‌ చిల్డ్రన్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్‌కి చిరంజీవిగారు వచ్చారు. అప్పటికే చాలా సమయం కావడంతో నా ప్రదర్శన చూడకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన నా డ్యాన్సులు చూసి ఉంటే నన్ను సినిమాల్లోకి తీసుకెళతారేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ).

► రోజుకు పది నుంచి పదిహేను కథలు వింటున్నాను. అలాగని ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్లలేను కదా? ‘హ్యాపీడేస్‌’ సినిమా చేసే ముందే మా అమ్మగారు ‘కుటుంబమంతా కలిసి చూసేలా నీ సినిమాలు ఉండాలి.. లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్లిపో’ అన్నారు. అందుకే అలాంటి మంచి కథలు ఎంచుకుంటున్నాను.

► ‘కార్తికేయ 2’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెం బరులో ప్రారంభమవుతుంది. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నా. ‘శ్వాస’ సినిమా ఆగిపోవడానికి కారణం డైరెక్షన్‌ టీమే. నాకు చెప్పిన కథ ఒకటి.. తీస్తోంది మరొకటి. అందుకే చేయకూడదనుకున్నా. అయితే ఆ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్‌ని నిర్మాతలు వెనక్కి తీసుకోకపోవడంతో వారితో ‘హనుమాన్‌’ అనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నా.

మరిన్ని వార్తలు