నా పని అయిపోయిందన్నారు

1 Jul, 2019 00:52 IST|Sakshi

– సందీప్‌ కిషన్‌

‘‘అందరూ నన్ను నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక నటుడికి అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం’’ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్‌ కథానాయిక. కార్తీక్‌ రాజు దర్శకుడు. దయా పన్నెం, సందీప్‌ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్‌ నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌ను  నిర్మాతలు కిరణ్, అనిల్‌ సుంకర విడుదల చేశారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ– ‘‘బ్రెయిన్‌ రీ ఫ్రెష్‌ కోసం  విదేశాలకు వెళ్లి వచ్చా. ఇక్కడికొచ్చేటైమ్‌కి బాగా లావయ్యాను. బరువు తగ్గి సినిమాలు చేద్దామనుకునేటప్పటికి... మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తి కలిశారు. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... ‘ఇంకెక్కడి సందీప్‌.. అయిపోయాడు. కొత్త హీరోలు వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు’ అన్నారట.

ఆ మాట చెప్పిన వ్యక్తికి థ్యాంక్స్‌.. ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్లే ఎప్పటికీ గుర్తుండిపోయేలా, ఓ కసితో ‘నిను వీడని నీడని నేనే’ సినిమా చేశా. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తాం’’ అన్నారు. ‘‘కథ విని, నేనే ప్రొడ్యూస్‌ చేస్తానని సందీప్‌ చెప్పడం నాకు సర్‌ ప్రైజ్‌’’ అన్నారు కార్తీక్‌ రాజు. దయా పన్నెం. సహనిర్మాత సుప్రియ, అన్య సింగ్, మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా