నన్ను విచిత్రంగా చూశారు

7 Oct, 2018 02:10 IST|Sakshi
ఉషా ఉతుప్‌

ఉషా ఉతుప్‌... మాంచి జోష్‌ ఉన్న సింగర్‌. ఫీమేల్‌ సింగర్‌ అంటే వాయిస్‌ సున్నితంగా ఉండాలి అనుకునే ఆలోచనని తన బేస్‌ వాయిస్‌తో బద్దలుకొట్టారు. పేద్ద బొట్టు, తల నిండా పువ్వులు, చీర కట్టుతోనే మనందరికీ ఎప్పుడూ కనిపిస్తారు. కెరీర్‌ స్టార్టింగ్‌లో తన వేషధారణ వల్ల ఎదుర్కొన్న ఓ విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కెరీర్‌ స్టార్టింగ్‌లో నైట్‌ క్లబ్‌లో పాటలు పాడేదాన్ని. నైట్‌ క్లబ్‌కి కూడా చీర కట్టుకొని వెళ్లేదాన్ని. అక్కడికి వచ్చిన వాళ్లంతా నన్ను స్టైజ్‌ మీద చూసి ‘ఈ అమ్మ ఏం పాడుతుందిలే..’ అన్నట్టుగా నన్ను విచిత్రంగా చూసేవారు.

తీరా నేను పాడటం అయిపోయిన తర్వాత ‘వావ్‌’ అన్నట్టుగా ముఖాలు పెట్టేవారు. చాలా మంది అనుకుంటారు ఉషా ఉతుప్‌ అనగానే చీర, పెద్ద బొట్టుతో కనిపిస్తారు.. ఇది మార్కెటింగ్‌ స్ట్రాటెజీ అని.  కానీ అలా ఏం కాదు. నేను చాలా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడూ చీరే కట్టుకునేవారు. నాకు తెలిసిన డ్రెస్‌ అదొక్కటే.  అలాగే నేను చీర కట్టుకొని వెళ్లడం వల్ల నైట్‌క్లబ్‌కి ఫ్యామిలీలు కూడా రావడం స్టార్ట్‌ అయ్యారు. అలా నైట్‌ క్లబ్‌ ఫ్యామిలీ ప్లేస్‌లా మారిపోయింది. ఆడియన్స్‌లో చాలా మంది నా ఫ్రెండ్స్‌ కూడా అయ్యారు. అలాగే భార్యలందరికీ తమ భర్తల మీద ఓ భరోసా ఉండేది.  నా శరీరాకృతి, నా అందం చూసి వాళ్ల భర్తల మనసు చలించదు అని  (నవ్వుతూ)’’ అంటూ తన మీద తానే జోక్‌ వేసుకుంటూ, పాత అనుభవాలను పంచుకున్నారు ఉషా ఉతుప్‌.

మరిన్ని వార్తలు