పాత రోజులు గుర్తొస్తాయి

13 Feb, 2019 00:10 IST|Sakshi
గురురాజ్, ప్రియ, వినోద్‌రెడ్డి

ప్రియా ప్రకాశ్‌ వారియర్, రావూఫ్‌ రోషన్‌ జంటగా నటించిన చిత్రం ‘లవర్స్‌ డే’ (మలయాళంలో ‘ఒరు ఆడార్‌ లవ్‌). ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి సుఖీభవ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాతలు ఎ.గురురాజ్, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి అందిస్తున్నారు. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేమికుల రోజున (ఫిబ్రవరి 14) విడుదల కానుంది. నిర్మాత ఎ. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఒరు ఆడార్‌ లవ్‌’ సినిమాపై క్రేజ్‌ పెరగడంతో తెలుగు హక్కుల కోసం టాలీవుడ్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. దాంతో భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులను సొంతం చేసుకొన్నాం.

ఇందుకు సహకరించిన సీతారామరాజు, సురేష్‌ వర్మలకు థ్యాంక్స్‌. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఒమర్‌ లులు ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ తమ యూత్‌ రోజులను గుర్తు చేసుకొంటారు. స్నేహం, ప్రేమ విలువను అద్భుతంగా చెప్పారు. గతంలో వచ్చిన ‘ప్రేమసాగరం, ప్రేమదేశం’ లాంటి సినిమాల రేంజ్‌లో ఉంటుంది ఈ సినిమా’’ అన్నారు . ‘‘ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకు పైగా రిలీజ్‌ అవుతోంది. తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత వినోద్‌ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: శీను సిద్ధార్థ్, సంగీతం: షాన్‌ రెహమాన్‌.

మరిన్ని వార్తలు