ఎవరూ ఎవరికీ పోటీ కాదు

20 Dec, 2018 00:20 IST|Sakshi

‘‘కేవలం డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటే ఓ సినిమా తర్వాత మరో సినిమా వెంటవెంటనే చేసేవాణ్ణి. కానీ, నాకు ఆ ఆశ లేదు. నేను సినిమాని, కథల్ని, డైరెక్టర్స్‌ని నమ్ముతాను. తోటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.. నేను చేయకపోతే ఎలా? అనే అభద్రతాభావం నాకు లేదు. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఉంటేనే నేను షూటింగ్‌కి వెళతాను. అందుకే సినిమా సినిమాకీ కొంత గ్యాప్‌ వస్తుంటుంది’’ అని శర్వానంద్‌ అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్‌ చెప్పిన విశేషాలు.

► హను 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్‌. ఎప్పటినుంచో ఓ సినిమా చేయమని అడుగుతున్నా. సుధాకర్‌గారు, నేను సినిమా చేద్దామనుకున్నప్పుడు హనుని అనుకున్నాం. తను మూడు కథలు చెబితే ‘పడి పడి లేచె మనసు’ కథని ఓకే చేశాం. ఈ చిత్రానికి ముందు హను చేసిన ‘లై’ సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ, తను ఓ మంచి టెక్నీషియన్‌. అందరూ జూనియర్‌ సుకుమార్, తెలుగు మణిరత్నం అని అంటుంటారు. హనూని ఎవరితోనూ పోల్చలేం. తనపై మణిరత్నం ఇన్‌స్పిరేషన్‌ ఉందేమో?   

► చక్కని ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఇందులో ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సూర్య పాత్రలో కనిపిస్తా. సినిమా అంతా ఫుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండదు. కోల్‌కత్తా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గతంలో ఈ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘చూడాలని వుంది, ఖుషి, లక్ష్మీ’ సినిమాలు మంచి హిట్‌ అయ్యాయి. ప్రేమకథలోనూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనే కోల్‌కత్తాలో షూటింగ్‌ చేశాం.

► అందరూ కనెక్ట్‌ అవుతారనే ‘పడి పడి లేచె మనసు’ టైటిల్‌ పెట్టాం. నా సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లవ్‌స్టోరీ అయినా ఓల్డర్‌ సెక్షన్‌కి కనెక్ట్‌ అయ్యింది. కానీ, ఈ సినిమా మాత్రం యువతతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కనెక్ట్‌ అవుతుంది. ఇందులో నేను సూర్య, సాయిపల్లవి వైశాలి పాత్ర చేశాం. సాయిపల్లవి వెరీ స్వీట్‌. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ హైలైట్‌. ఇప్పటి వరకూ ఏ హీరోయిన్‌తోనూ ఇంత బాగా కెమిస్ట్రీ వర్కవుట్‌ కాలేదని అందరూ నాతో అంటున్నారు.

► డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు. కానీ, టేస్ట్‌ ఉన్న నిర్మాతలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సుధాకర్‌గారు ఒకరు. కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. జయకృష్ణ గుమ్మడి చక్కని విజువల్స్‌ ఇచ్చారు. విశాల్‌ చంద్రశేఖర్‌ అద్భుతమైన పాటలిచ్చారు.

► నా కెరీర్‌లో ఇప్పటి వరకూ ఏదీ ప్లాన్‌ చేయలేదు. అన్ని జోనర్‌ కథలు వింటున్నా. వెంట వెంటనే ఒకే జోనర్‌లో సినిమాలు చేయకూడదనుకుంటున్నా. నా సినిమాలే నా మార్కెట్‌ని పెంచుతున్నాయి. అవార్డులు రావాలని సినిమా చేయను. ఓ సినిమాని నా వరకు 100 శాతం ప్రేమించి చేస్తా. తమిళం నుంచి అవకాశాలొస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి తెలుగులో హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు సినిమాలు నిర్మించే టైమ్‌ లేదు.

► బన్నీ (అల్లు అర్జున్‌), మేము కలిసి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాళ్లం.. ఫంక్షన్స్‌కి వెళ్లేవాళ్లం. నేను అడగ్గానే తను మా ఫంక్షన్‌కి వచ్చి యూనిట్‌ని ఆశీర్వదించినందుకు హ్యాపీ. మా సినిమాతో పాటు రిలీజ్‌ అవుతున్న తమ్ముడు వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ సినిమా కూడా బాగా ఆడాలి. ఇండస్ట్రీలో ఎవరి స్పేస్‌ వారికి ఉంటుంది. ఎవరూ ఎవరికీ పోటీ కాదు. అందరం బాగుంటాం. అందరి సినిమాలూ ఆడాలి.

► ‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో సుజిత్‌ నన్ను పూర్తిగా మార్చేశారు. అప్పటి నుంచి సినిమా సినిమాకి నా లుక్, స్టైల్‌ మారుతోంది. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 50 శాతం పూర్తయింది. 1980నాటి గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇది ‘ప్రస్థానం’ సినిమాలా మాస్‌గా ఉంటుంది. తమిళ ‘96’ మూవీ తెలుగు రీమేక్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా.

► ‘గతంలో మీరు ప్రేమలో ఉన్నానని అన్నారు. ఎవరితో?’ అనే ప్రశ్నకు– ‘‘అప్పుడు ఉన్నానని చెప్పాను. ఇప్పుడు కాదు. టైమ్‌ వచ్చినప్పుడు చెబుతా’ అన్నారు శర్వానంద్‌ (నవ్వుతూ).

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా