ఎన్టీఆర్ ఒక నిమిషం ఆగి ...

21 Jan, 2016 09:12 IST|Sakshi
ఎన్టీఆర్ ఒక నిమిషం ఆగి ...

తిరుపతి : నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి..ఉన్నస్థాయికి ఎదిగినప్పటికీ తమ మాతృరంగమైన నాటకాన్ని పరుచూరి గోపాలకృష్ణ నేటికీ మరిచిపోలేదు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలకు వచ్చి, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. నాటక రంగం తల్లి వంటిదని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
 
ప్ర : నాటక రంగంపై మీ అభిప్రాయం ఏమిటి.
జ:  మా అన్నదమ్ములు సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ మాకు పునాది నాటక రంగమే. నాటక రంగం తల్లి వంటిది. అలాంటి తల్లిపాలు తాగిన వారే టీవీ, సినీ రంగంలో సుదీర్ఘకాలం మనుగడ సాధించగలుగుతారు.
 
ప్ర : సినిమాకు,నాటకానికి మధ్య వ్యత్యాసం ఉందా.
జ: కచ్చితంగా ఉంది. సినిమా వ్యాపారం, నాటకం కళాత్మకం. సినిమా తీస్తే లాభాల గురించి ఆలోచిస్తారు. పెట్టిన సొమ్ము తిరిగి రాదని తెలిసీ సొంత డబ్బులు పెట్టి నాటకాలు వేస్తారు. నాటకం ద్వారా ఇచ్చే సందేశం నేరుగా ప్రజల్లోకి వెళ్లినా అది కేవలం కొంతమందికే పరిమవుతుంది. సినిమా అలా కాదు. విశ్వవ్యాప్తం కావడంతో సినిమా ప్రభావం ఎక్కువగా ఉంది.
 
 ప్ర: సంగీతానికి నంది ఇవ్వాలనే డిమాండ్‌పై మీ అభిప్రాయం.
 జ: కచ్చితంగా ఇవ్వాల్సిందే. నంది అవార్డుల అభివృద్ధికి ఈ నెల 26న రాష్ట్రస్థాయిలోని అన్ని కళాపరిషత్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. అందులోనే సంగీతం, నృత్యం, లలితకళలకు నంది ఇవ్వాలని ప్రతిపాదన చేయనున్నాం.
 
ప్ర: రంగస్థల అభివృద్ధిలో మీ  కృషి.
జ:  నాటక రంగం అభివృద్ధికి పాతికేళ్లలో మా వంతుగా కృషి చేస్తున్నాం. సొంత ఊరైన పల్లెకోనలో సుమారు రూ.కోటితో థియేటర్ నిర్మించి అందులో సొంత మారుతీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నాటకరంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. నాటక పోటీలను నిర్వహించి కళను ప్రోత్సహిస్తూ, కళాకారులను ఆదరిస్తూ తమ వంతు కృషి చేస్తున్నాం.   
 
ప్ర: పరుచూరి బ్రదర్స్ అనే పేరు ఎలా వచ్చింది.
జ: ఈ పేరును అన్న ఎన్టీరామారావే పెట్టారు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి.. ఏం బ్రదర్, కథలు, మాటలను అన్నదమ్ములిద్దరూ రాస్తున్నారు, మరి సినిమాల్లో పరుచూరి అని ఒకరు పేరు వచ్చేలా ఎందుకు పెడుతున్నారని అడిగారు. లేదు సార్, మేము  కూడా అదే ఆలోచిస్తున్నాం. పరుచూరి అండ్ పరుచూరి, లేదా ఇద్దరి పూర్తి పేర్లు పెట్టానుకుంటున్నామని చెప్పాం. వెంటనే ఎన్టీఆర్ ఒక నిమిషం ఆగి పరుచూరి బ్రదర్స్ అని పెట్టుకోండని చెప్పారు.
 
ప్ర: రచయితగా మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
జ: ఉయ్యూరులోని కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో నేను తరగతి గదిలో చెబుతున్న పాఠాలకు విద్యార్థులు చప్పట్లు కొట్టేవారు. దీనిని గమనించిన కళాశాల గవర్నింగ్ బాడీప్రెసిడెంట్ అడుసుమిల్లి విశ్వేశ్వరరావు నన్ను పిలిచి సినిమాలు ఎందుకు చేయకూడదన్నారు. సినిమాలు చేస్తే తప్పకుండా రాణిస్తావని చెప్పి ఆయన కుమారులు నిర్వహిస్తున్న మారుతీ బ్యానర్‌లో అవకాశమిచ్చారు.
 
ప్ర:ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?

జ: మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం, తమిళ సినిమా తని ఒరువన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సినిమాకు మాటలు రాస్తున్నాను.