అమ్మ సలహాలు తీసుకున్నా

26 Jan, 2020 02:50 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్‌

‘‘పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం వస్తే వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సీనియర్‌ హీరోలతోనే చేస్తే యంగ్‌ హీరోలతో అవకాశాలు తగ్గుతాయేమో? లాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోను. వచ్చిన పాత్రకు నటిగా పూర్తి న్యాయం చేయాలనుకుంటాను’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్, తాన్యా హోప్‌ హీరోయిన్లు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైన సందర్భంగా పాయల్‌ చెప్పిన విశేషాలు.  

► 2020 చాలా అద్భుతంగా ప్రారంభమైంది. మా ‘డిస్కోరాజా’కు మంచి స్పందన లభిస్తోంది. నా పాత్ర బావుందని, పాత్ర నిడివి పెద్దది కాకపోయినా దాని ప్రభావం బావుందని అభినందిస్తున్నారు. దర్శకుడు వీఐ ఆనంద్‌గారు కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే కథ విన్న వెంటనే సినిమా చేయాలనుకున్నా. నా పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోలేదు.
 
► సినిమాలో మూగ చెవిటి అమ్మాయిగా నటించాను. ఏదైనా విషయాన్ని మాటల్లో అర్థం అయ్యేలా చెప్పేయొచ్చు. కానీ నా పాత్ర  ఏదైనా కళ్లతోనే చెప్పాలి.  మాట్లాడకుండా భావాన్ని వ్యక్తపరచడం చాలా కష్టం. ఈ పాత్ర చేయడం నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. 
 
► కథానుసారం నా పాత్ర రెట్రో లుక్‌లో ఉంటుంది. ఆ పాత్రకు తయారవడం కోసం మా అమ్మ దగ్గర చాలా సలహాలు తీసుకున్నాను. అప్పట్లో డ్రెస్సింగ్‌ స్టయిల్‌ ఎలా ఉండేది? ఎలాంటి బట్టలు వేసుకునేవారని అడిగి తెలుసుకున్నా. నా పాత్రను బాలీవుడ్‌ హీరోయిన్లు హెలెన్, హేమ మాలినీ, టబు, జీనత్‌ పాత్రల ఆధారంగా డిజైన్‌ చేశారు.  

► గత ఏడాదిగా షూటింగ్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాను. ఈ ఇండస్ట్రీ నాకు పేరు, డబ్బు, అభిమానం ఇచ్చింది. అందుకే ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం. ఈ మధ్యే తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమా పూర్తి చేశాను. అందులో ఐపీఎస్‌ అధికారిగా నటించా. తమిళంలో ‘ఏంజెల్‌’ అనే సినిమా చేశా. వరుసగా మంచి సినిమాల్లో భాగమవుతూ వస్తున్నా. అదే కొనసాగించాలనుకుంటున్నాను. అందుకే కథల ఎంపికలో ఇంకా జాగ్రత్తగా ఉంటాను.

► లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో బాధ్యత అంతా హీరోయిన్ల మీదే ఉంటుంది. అది కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంటుంది. కెరీర్‌ తొలి రోజుల్లేనే ఇలాంటి సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.

► ‘ఆర్‌ఎక్స్‌ 100’ నా కెరీర్‌లో చాలా స్పెషల్‌ సినిమా. ఆ సినిమాయే నాకు ఓ గుర్తింపు తెచ్చింది. నాకో ఇమేజ్‌ తీసుకొచ్చింది. తీరిక లేకుండా పని చేసేలా చేసింది. ఆ సినిమా ద్వారా నాకు మాస్‌ ఫాలోయింగ్‌ వచ్చింది. ‘ఆర్‌డీఎక్స్‌’తో కొంచెం బ్రేక్‌ చేశాను. ‘వెంకీ మామ’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యాను. ఇలా ప్రతి సినిమాకు ఆడియన్స్‌ను పెంచుకుంటూ వెళ్లాలనుకుంటున్నాను. 

మరిన్ని వార్తలు