వివాదాస్పద సన్నివేశంపై స్పందించిన నటి

27 Jun, 2020 12:22 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరా భాస్కర్‌ తాజాగా నటించిన వెబ్‌సిరీస్‌‌ ‘రాస్‌భరి’. అయితే దీనిలోని ఓ సన్నివేశం పట్ల సినీ గేయ రచయిత, సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చీఫ్ ప్రసూన్ జోషి​ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగి ఉన్న పురుషుల ముందు ఓ చిన్న అమ్మాయి వారిని రెచ్చగొట్టేలా డ్యాన్స్‌ చేస్తుందని.. పిల్లలను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం అవసరమా అని ప్రసూన్‌ జోషి ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘రాస్‌భరి’ టీమ్‌తో పాటు దీనిలో ప్రధాన పాత్రలో నటించిన స్వరా భాస్కర్‌ను ఉద్దేశిస్తూ ప్రసూన్‌ జోషి ట్వీట్‌ చేశారు.  ‘‘రాస్‌భరి’ వెబ్‌సిరీస్‌లో ఓ చిన్న పాప తాగుబోతులను రెచ్చగొడుతూ డ్యాన్స్‌ చేస్తున్న దృశ్యాలను చూస్తే చాలా విచారం కలిగింది. ‘రాస్‌భరి’ టీం ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందని నేను అనుకోలేదు. ఇలాంటి సన్నివేశాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకేతాలా లేక దోపిడీ స్వేచ్ఛకు ఉదాహరణలా’ అనే దాని గురించి ప్రేక్షకులు, మేధావులు ఆలోచించుకోవాలి. వినోదం కోసం చిన్నారులను ఇలాంటి సన్నివేశాల్లో నటింపజేయడం ఎంత వరకు కరెక్ట్‌’ అంటూ ప్రసూన్‌ జోషి ట్వీట్‌ చేశారు. (బరువు పెరుగుతున్నా!)
 

దీనిపై స్వరా భాస్కర్‌ స్పందించారు. ‘బహూశా ఈ సీన్‌ అపార్థానికి దారి తీస్తుందేమో. కానీ ఈ సన్నివేశం మీరు ఊహించిన దానికి పూర్తిగా భిన్నం. ఆ పాన తన ఇష్టానుసారం డ్యాన్స్‌ చేస్తుంది. అది చూసి ఆమె తండ్రి సిగ్గుపడతాడు. అంతే తప్ప ఇక్కడ ఆ చిన్నారి డ్యాన్స్‌ ఎవరిని రెచ్చగొట్టే ఉద్దేశంతో తీయలేదు. సమాజం తనను కూడా లైంగిక దృష్టితో చూస్తుందనే విషయం పాపం తనకు తెలియదు. ఇది మన సమాజపు ఆలోచన తీరు’ అంటూ ఘాటుగా స్పందించారు స్వరా భాస్కర్‌. వెబ్‌సిరీస్‌లో ఈ సన్నివేశం స్వరా చిన్నప్పటి వెర్షన్‌లో వస్తుంది. ఓ స్టూండెట్‌ తన టీచర్‌ వెంటపడే కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌పై ఇప్పటికే చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్‌సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది. (అమ్మా తప్పు చేశానా?)

మరిన్ని వార్తలు