పవన్‌కల్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నా!

13 Jan, 2015 23:11 IST|Sakshi
పవన్‌కల్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నా!

‘‘రీమేక్ చిత్రాలు చేయడం అంత సులువు కాదు. అది కూడా ఓ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయడం అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఒకవేళ సరిగ్గా తీయలేకపోతే విమర్శలు వస్తాయి’’ అని దర్శకుడు కిశోర్‌కుమార్ పార్ధసాని అన్నారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
 
  ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని కిశోర్‌కుమార్ అన్నారు. మరిన్ని విశేషాలను సోమవారం విలేకరులతో చెబుతూ -‘‘వెంకటేశ్, పవన్ కల్యాణ్ సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపన ఉన్న వ్యక్తులు. అలాంటి వారితో సినిమా చేయడం నా లక్. కృష్ణుడి పాత్ర కాబట్టి, పవన్ కల్యాణ్ చాలా నిష్ఠగా చేశారు. వాస్తవానికి హిందీ చిత్రంలో దేవుడి పాత్ర పరిచయ సన్నివేశం సాదాసీదాగా ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్‌కి ఉన్న ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, పరిచయ సన్నివేశాన్ని భారీగా తీశాం. ఈ చిత్రానికి మరో ప్రధాన హైలైట్ సంభాషణలు. కథానుసారం సాయిమాధవ్ బుర్రా అద్భుతంగా రాశారు.
 
  ‘సమర్థులు ఇంట్లో కూర్చుంటే.. అసమర్థులు రాజ్యమేలుతారు..’, ‘ఆలస్యంగా వచ్చినా రావడం మాత్రం పక్కా..’ అని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్  రాజకీయాలను ఉద్దేశించినట్లుగా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కానీ, సన్నివేశానుసారమే ఇవి ఉన్నాయి. ఈ చిత్రానికి మరో హైలైట్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన పాటలు’’ అన్నారు. తదుపరి చిత్రం పవన్ కల్యాణ్‌తో చేయబోతున్నాననీ, ఈ చిత్రం కోసం కథ సిద్ధం చేస్తున్నానని కిశోర్‌కుమార్ తెలిపారు.
 

>