నటిగా పరిచయమై 17 ఏళ్లు.. ఆ కోరిక తీరలేదు

4 Jan, 2020 10:34 IST|Sakshi

సినిమా: ఆ కోరిక తీరలేదంటోంది నటి ప్రియమణి. తమిళ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముత్తళగి(పరుత్తివీరన్‌ చిత్రంలోని పాత్ర) ఈ భామ. కేరళా చిన్నది తమిళం, తెలుగు భాషల్లోనూ కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. పరుత్తివీరన్‌ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్న  ప్రియమణి వివాహానంతరం నటనకు దూరమైంది. సినిమాలకు దూరం అయినా, బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇటీవల వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో వెండితెరకూ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇలా రియాలటీ షోలు, వెబ్‌ సిరీస్, సినిమాలు అంటూ మళ్లీ బిజీ అయిపోయింది. తమిళంలో సంచలన విజయాన్ని సాధించిన అసురన్‌ చిత్ర తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ సరసన నటించే అవకాశం ప్రియమణినే వరించింది. ఈ సందర్భంగా ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటిగా పరిచయమై 17 ఏళ్లు అయిందని చెప్పింది.

ఈ పయనాన్ని ఒక్కోసారి వెనక్కు తిరిగి చూసుకుంటే సంతోషం కలుగుతోందని అంది. ఈ కొత్త సంవత్సరం నటిగా తనకు ఇంకా బాగుంటుందనే నమ్మకం ఉందని చెప్పింది. ప్రస్తుతం ది ఫ్యామిలీమెన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నానని, ఇందులో సుచిత్రా తివారి అనే పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. ముంబాయిలో నివసించే తమిళ అమ్మాయి పాత్ర అనగానే నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ప్రస్తుతం సీజన్‌ 2 చిత్రీకరణ జరుగుతోందని, ఇందులో నటి సమంత కూడా పాల్గొననున్నట్లు తెలిపింది. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని సన్నివేశాల్లో తనను పోల్చుకునేలా సన్నివేశాలు ఉన్నాయంది. భార్యాభర్తల మధ్య చాలా సహజత్వానికి దగ్గరగా ఉండేలా సన్నివేశాలు ఇందులో ఉన్నాయని చెప్పింది. నిజ జీవితంలో  తనకు తన భర్తకు జరిగే సంఘటనలు ఇలానే ఉంటాయని అంది. తానే కాదు అందరూ కనెక్ట్‌ అయ్యేల యధార్థ సన్నివేశాలు చోటు చేసుకున్నాయని చెప్పింది. 

తన డ్రీమ్‌ రోల్‌ ఏమిటని చాలా మంది అడుగుతున్నారని, పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ చేసిన నీలంబరి పాత్ర మాదిరి ఒక నెగిటివ్‌ పాత్రనే తన డ్రీమ్‌రోల్‌ అని చెప్పింది. తన వాయిస్‌ నెగిటివ్‌ పాత్రలకు బాగుంటుందని చాలా మంది చెబుతుంటారని పేర్కొంది. అలాంటి పూర్తి స్థాయి ప్రతినాయకి పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తాను ప్రారంభ దశలోనే భారతీరాజా, బాలుమహేంద్ర వంటి లెజెండ్రీ దర్శకుల చిత్రాల్లో నటించానంది. అయితే  ఇక్కడ తనకుంటూ ఒక స్థానం లభించలేదన్న బాధ ఉందా? అంటే కచ్చితంగా ఉందనే చెబుతానంది. తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటిచాలన్న తన కోరిక తీరలేదని చెప్పింది. ఆ ఆశ ఇప్పటికీ ఉందని అంది. కాగా తమిళంలో జయలలిత బయోపిక్‌గా తెరకెక్కనున్న  తలైవి చిత్రంలో శశికళ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోందని, అయితే అది ఇప్పుటికి న్యూస్‌గానే ఉందని, ఇంకా కన్ఫర్మ్‌ కాలేదని చెప్పింది. ఆ చిత్రంలో తాను నటిస్తున్నానా? లేదా? అన్నది ఆ చిత్ర వర్గాల నుంచే ప్రకటన రావాలని ప్రియమణి పేర్కొంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా