ఆ మిస్సయిన పేజీలే ఆసక్తికరం : సాజిద్ ఖురేషి

13 Jul, 2013 02:34 IST|Sakshi
ఆ మిస్సయిన పేజీలే ఆసక్తికరం : సాజిద్ ఖురేషి
‘‘తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేయడానికి కథ రెడీ చేసుకుని, చెన్నయ్ వెళ్లాను. ఆ కథ విని నెగిటివ్ రోల్ చేయడానికి పార్తిబన్ అంగీకరించారు. మిగతా తారాగణాన్ని ఎంపిక చేస్తున్న సమయంలో ‘నడువుల కొంజెం పక్కత కానమ్’ అనే తమిళ సినిమా చూశాను. దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనుకున్నా. తమిళ టైటిల్‌ని యదాతథంగా అను వదించి, తెలుగు చిత్రానికి ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ అనే టైటిల్ పెట్టా’’ అన్నారు సాజిద్ ఖురేషి.
 
  శ్రీ, సుప్రజ జంటగా మహ్మద్ సొహైల్ అన్సారీ నిర్మించిన చిత్రం ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. సాజిద్ ఖురేషి దర్శకుడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాజిద్ మాట్లాడుతూ -‘‘కథ, కథనంలో మార్పులు చేసి ఈ సినిమాని రూపొందించాం. నలుగురు స్నేహితుల కథ ఇది. పెళ్లి ఖరారైన తమ స్నేహితుడు ‘షార్ట్ టైమ్ మెమరీ లాస్’కి గురైతే, ఆ విషయాన్ని దాచేసి అతనికి ఏ విధంగా స్నేహితులు పెళ్లి చేస్తారు? అనేది కథాంశం. 
 
 ఆ మిస్సయిన పేజీలే ఆసక్తికరం. ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన సినిమా కాబట్టి ఓ నమ్మకంతో తీశాం. రెండు ట్రైలర్స్‌ని యు ట్యూబ్‌లో 10 లక్షల మంది చూశారు. శ్రీ అద్భుతంగా యాక్ట్ చేశాడు. తమిళ వెర్షన్ విజయం సాధించడంతో పాటు పలు అవార్డులు కూడా దక్కించుకుంది. తెలుగుకి కూడా అలాంటి ఆదరణే లభిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. తదుపరి ‘ప్రవేశం’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.