రాశీ పేరు రాశాడు!

26 Apr, 2017 00:34 IST|Sakshi
రాశీ పేరు రాశాడు!

తినే ప్రతి మెతుకు మీద దేవుడు పేరు రాస్తాడట! ఏ మెతుకు ఎవరికి దక్కాలో వారికి దక్కుతుందని దానర్థం. అలాగే, ప్రతి సినిమా ప్రారంభానికి ముందు టైటిల్‌ కార్డ్స్‌లో ఏయే పేర్లు పడాలో కూడా దేవుడే నిర్ణయిస్తాడేమో! ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... వరుణ్‌ తేజ్‌ హీరోగా వెంకీ అట్లూరి (‘స్నేహగీతం’ ఫేమ్‌ – హీరో) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా ముందు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్‌ మెహరీన్‌ను అనుకున్నారు.

అయితే... దేవుడు రాశీ పేరు రాసినట్లున్నాడు. మెహరీన్‌ స్థానంలో రాశీ ఖన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల ‘ఫిదా’లో నటిస్తున్నారు వరుణ్‌. ఈ సినిమా పూర్తయ్యాక వెంకీ అట్లూరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. వరుణ్‌ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించనున్న మొదటి చిత్రమిది. ఇది కాకుండా రాశీ చేతిలో మూడు తెలుగు సినిమాలున్నాయి. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’, ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’లలో ఈ ఢిల్లీ బ్యూటీ నటిస్తున్నారు. గోపీచంద్‌కు జోడీగా నటించిన ‘ఆక్సిజన్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.

‘ఫిదా’లో హర్షవర్థన్‌ రాణె?
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫిదా’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో హీరో హర్షవర్థన్‌ రాణె (‘అవును’ ఫేమ్‌) అతిథి పాత్రలో నటిస్తున్నారట. ‘‘సర్‌ప్రైజ్‌...  నాకిష్టమైన దర్శకులలో ఒకరు, నేను ఆల్రెడీ పనిచేసిన దర్శకుడి కోసం అతిథి పాత్రలో నటిస్తున్నా’’ అని హర్షవర్థన్‌ రాణె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. హర్ష పేర్కొన్న దర్శకుడు శేఖర్‌ కమ్ములే అని టాక్‌. ‘ఫిదా’కు ముందు శేఖర్‌ కమ్ముల తీసిన ‘అనామిక’లో ఈ హీరో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి