‘సల్మాన్‌.. జియా కేసు దర్యాప్తును అడ్డుకున్నాడు’

17 Jun, 2020 18:09 IST|Sakshi
జియా ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ (ఫైల్‌)

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంతో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. బంధుప్రీతి గురించి సంచలన ఆరోపణలు చేశారు. బయటివారిని ఇండస్ట్రీ పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటి జియాఖాన్‌ తల్లి సల్మాన్‌ ఖాన్‌ గురించి కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె ఆత్మహత్య దర్యాప్తును సల్మాన్‌ దెబ్బతీశారని వెల్లడించారు. సూరజ్‌ పంచోలిని కాపాడటం కోసం సల్మాన్‌ తన పేరు, డబ్బును ఉపయోగించారని తెలిపారు. సుశాంత్‌ మృతికి సంతాపం తెలిపిన రబియా.. ‘హీరో మృతి తన హృదయాన్ని ముక్కలు చేసిందని.. బాలీవుడ్‌ ఇప్పటికైనా మేల్కొనాలి. బెదిరించడం కూడా ఒకరిని చంపడం లాంటిదే’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2015లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. (బాయ్‌కాట్‌ సల్మాన్‌)

‘సుశాంత్‌ విషయంలో ఏం జరిగిందనేది చూస్తే.. నాకు 2015లో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. సీబీఐ అధికారులు నాకు ఫోన్‌ చేసి ‘మీరు ఒకసారి రండి. మీ అమ్మాయి ఆత్మహత్య కేసు విషయంలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది’ అని చెప్పి నన్ను లండన్‌ నుంచి పిలిపించారు. నేను ఇక్కడకు వచ్చాక ఆ అధికారి.. ‘సల్మాన్‌ ఖాన్‌ ప్రతిరోజు నాకు కాల్‌ చేసి.. సూరజ్‌ పంచోలి మీద చాలా పెట్టుబడి పెట్టాను. అతడిని వేధించకండి. దయచేసి అతడిని విచారించకండి.. అసలు ఆ కుర్రాడి జోలికే వెళ్లకండి అని చెప్తున్నారు. ఇలాంటప్పుడు నేనేం చేయాలి మేడం’ అని ఆవేదన వ్యక్తం చేశారు’ అని రబియా గుర్తు చేసుకున్నారు. ‘బాలీవుడ్‌లో జరుగుతున్న మరణాలు.. వాటికి సంబంధించిన దర్యాప్తులను దెబ్బ తీయడానికి మీరు డబ్బు, అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. మనం ఎక్కడకు వెళ్తున్నామో మీకైనా అర్థమవుతుందా’ అని రబియా ప్రశ్నించారు. (సుశాంత్‌ మృతికి కారణం తెలుసు: నటుడు)

‘బాలీవుడ్‌లో ఉన్న ఈ విషపూరిత ప్రవర్తనకు వ్యతిరేకంగా నిలబడండి.. పోరాడండి.. నిరసన తెలపండి’ అని రబియా పిలుపునిచ్చారు. 2013 జూన్ 3న ముంబైలోని జుహు ప్రాంతంలోని తన నివాసంలో జియా ఖాన్‌ ఆత్మహత్య చేసుకుని మరణించారు. 25 ఏళ్ల ఈ నటి తన ప్రియుడు సూరజ్‌తో తన బంధం ముగిసిందని సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్‌ను ఆత్మహత్యకు కారణమయ్యారని అప్పట్లో సూరజ్‌పై కేసు పెట్టారు. ఇదిలా ఉండగా దబాంగ్‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌.. సల్మాన్‌, అతడి కుటుంబం తన కెరీర్‌ను నాశనం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. (‘సల్మాన్‌ నా కెరీర్‌ను నాశనం చేశాడు’)

మరిన్ని వార్తలు