నాకంత డబ్బు లేదు!

21 Jan, 2019 10:53 IST|Sakshi

నాకంత డబ్బు లేదు అంటోంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో కార్తీతో రొమాన్స్‌ చేస్తున్న దేవ్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరిలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కార్తీతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న రెండవ చిత్రం. ఇంతకు ముందు ఈ జంట నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం మంచి విజయాన్ని సాధించి రకుల్‌ను నిలబెట్టింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ భేటీ చూద్దాం.

కార్తీతో రెండవ సారి నటించడం గురించి?
ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రానికి పూర్తి భిన్నంగా దేవ్‌ చిత్రం ఉంటుంది. ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రంగా ఉంటుంది. ఇందులో నేను మేఘ్న అనే ధైర్యమైన అమ్మాయిగా నటించాను. నా పేరును కూడా నేను ఎంచుకునే స్వతంత్ర భావాలు గలిగిన యువతి పాత్ర. అయితే నిజ జీవితంలో ఇందుకు నేను పూర్తి వ్యతిరేక స్వభావిని. దేవ్‌ చిత్రంలో కార్తీ ప్రయాణాన్ని ఇష్టపడే యువకుడిగానూ, నేను పనిని ఇష్టపడే అమ్మాయిగానూ నటించాం. అలాంటి విరుద్ధ భావాలు కలిగిన వారు ఎలా ఒకటయ్యారన్నదే చిత్ర కథ.

సూర్యకు జంటగా ఎన్‌జీకే చిత్రంలో నటించిన అనుభవం?
ఎన్‌జీకే చిత్రంలో నటించడం మంచి అనుభవం. నేను సూర్యకు వీరాభిమానిని.

సూర్య, కార్తీల గురించి?
సూర్య, కార్తీ ఇద్దరూ ప్రతిభావంతులైన నటులు. మంచి స్నేహశీలులు. వారిద్దరితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా లక్కీగా భావిస్తున్నాను.

హిందీ చిత్రంలో నటిస్తున్న అనుభవం గురించి?
తమిళ్, హిందీ అని విడదీసి మాట్లాడడం నాకు నచ్చదు. ప్రతిభను మాత్రమే చూడండి. శ్రీదేవి, టబు, మధుబాల, తాప్సీ ఇక్కడ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి చాలా సాధించారు.

సరే మీరు శ్రీదేవి బయోపిక్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోందే?
నాకు బయెపిక్‌లలో నటించడం అంటే చాలా ఇష్టం. ఎవరి పాత్రలో నటించాలన్నా సిద్ధమే. సావిత్రి బయోపిక్‌ లాంటివి చాలా రావాలి. ఇకపోతే శ్రీదేవి బయోపిక్‌ గురించి ఇంకా నన్నెవరూ సంప్రదించలేదు. అలాంటి అవకాశం వస్తే నటించడానికి రెడీ.

ఇటీవల ట్విట్టర్‌లో అభిమానిపై ఘాటుగా స్పందించడం గురించి?
నేను కురుచ దుస్తులు ధరించడంతో జరిగిన గొడవ గురించి అడుగుతున్నారా? నిజం చెప్పాలంటే ఆ ఫొటోలు నా అనుమతి లేకుండా తీసినవి. ఆ ఫొటోలకు నేనెలా బాధ్యరాలినవుతాను. ఆ ఫొటోలకు చేసిన కామెంట్స్‌ నన్ను బాధించాయి. అందుకే ఆగ్రహించాను. కొందరు నోళ్లు మూయించడానికి నేనలా ప్రవర్తించాల్సి వచ్చింది. కామెంట్‌ చేసిన ఆ యువకుడికీ ఒక కుటుంబం ఉందనేది గ్రహించాలనే కాస్త ఘాటుగా మాట్లాడాను. ఇకపై అతను అలాంటి కామెంట్స్‌ చేయడని భావిస్తున్నాను. అంతే కాకుండా ఇలాంటి సమస్యలపై మహిళలు ధైర్యంగా బదులివ్వాలి.

ఇతర వ్యాపారాలపై తీవ్రంగా దృష్టి పెడుతున్నారట?
ఇక్కడో విషయాన్ని స్పష్టం చేయాలి. నేను హోటల్‌ వ్యాపార రంగంలోకి దిగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. హైదరాబాద్, విశాఖపట్టణంలో జిమ్‌లను మాత్రం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకు వ్యాయామం చాలా అవసరం.

చిత్ర నిర్మాణం గానీ, దర్శకత్వం ఆలోచన గానీ ఉన్నాయా?
నాకు చిత్రాన్ని నిర్మించేంత డబ్బుగానీ, దర్శకత్వం వహించేంత సృజనాత్మకతగానీ లేవు.  నేను కెమెరా ముందు నిలబడడానికి ఇష్టపడతాను.

మరిన్ని వార్తలు