Chetan Ahimsa: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్‌ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్‌

20 Nov, 2023 11:01 IST|Sakshi

కోట్లాది మంది కల ఒక్కసారిగా బుగ్గిపాలైంది. గెలుపును మాత్రమే కలగన్నవారికి ఒక్కసారిగా భంగపాటు ఎదురైంది. అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్పు ఎగరేసుకుపోయింది. టీమిండియా ఓటమితో యావత్‌ భారత్‌ ఉద్వేగానికి లోనైంది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్‌ అభిమానులు కలత చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇలాంటి సమయంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్‌ అహింస వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ చెప్తున్నా.. క్రికెట్‌ క్రీడలో కూడా రిజర్వేషన్స్‌ ఉండాలి. ఆ రిజర్వేషన్స్‌ ఈపాటికే అమలై ఉంటే భారత్‌ వరల్డ్‌ కప్‌ సులువుగా గెలిచేది' అని ట్వీట్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అందరూ బాధలో ఉంటే నీ గోల ఏంటి?', 'ఇక్కడ కూడా రిజర్వేషన్లా?', 'పెద్ద సైకోలా ఉన్నావే?' అని ట్రోల్‌ చేస్తున్నారు.

వరల్డ్‌ కప్‌ జరిగే రోజు చేతన్‌ మరో ట్వీట్‌ కూడా చేశాడు. 'ఈ రోజు క్రికెటర్లు బంతి క్యాచ్‌ చేస్తారు, లేదంటే విసురుతారు.. దాన్ని బ్యాట్‌తో కొడతారు.. అంతే తప్ప దేశ నిర్మాణం కోసం ఇసుమంత సాయం కూడా చేయరు. వందేళ్ల క్రితం పల్వంకర్‌ బాలూ అని ఓ దళిత క్రికెటర్‌ సామాజిక కార్యకర్తగా చురుకుగా పనిచేశాడు. డబ్బు, ఫేమ్‌ కోసం పాటుపడే వాళ్లు కాకుండా ఇతడిలా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లే దేశానికి అవసరం' అని ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్‌ చేస్తోన్న హీరో

మరిన్ని వార్తలు