రంగు పడనివ్వం

13 Nov, 2018 02:37 IST|Sakshi
దిలీప్

తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్‌ ఐ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. విజయవాడకు చెందిన లారా (పవన్‌ కుమార్‌) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్‌ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్‌ (లారా బావ మరిది) మాట్లాడుతూ– ‘‘లారా గురించి సమాచారం సేకరించడానికి దర్శకుడు కార్తికేయ ఏడాది క్రితం విజయవాడ వచ్చినప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్‌మీట్‌ చూశాం. లారా అనే రౌడీషీటర్‌.. అనే వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. లారా మీద రౌడీషీట్‌ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌ అయితే వాళ్ల మీద ఎంత ఎఫెక్ట్‌ పడుతుందో ఆలోచించాలి. సినిమా ట్రైలర్‌ చూసిన దగ్గర నుంచి ‘రంగు’ దర్శక, నిర్మాతలను కలవాలని ప్రయత్నించాను, కానీ కుదరలేదు. సినిమాని ముందుగా మాకు చూపించి, మా అంగీకారంతోనే విడుదల చేయాలి. లేదంటే సినిమా విడుదలని లీగల్‌గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్‌  పడనీయం’’ అన్నారు. లారా స్నేహితులు సందీప్, ధనుంజయ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు