యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించే చిత్రం : రావు రమేశ్‌

9 Feb, 2019 19:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మహానేత వైఎస్సార్‌ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే కేవీపీ పాత్రలో రావురమేశ్‌ ఒదిగిపోయారు. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్‌ స్పందించారు. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలేనని తన సంతోషాన్ని పంచుకున్నారు.

‘ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవకు అభినందనలు. ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమా చూసి రాత్రంతా ఆ మహానేత గురించే ఆలోచించాను. సినిమాలోని ప్రతీ సీన్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి అంతరాత్మను తాకే సినిమా ఇది. ముఖ్యంగా యాత్రలో భాగంగా వచ్చే ప్రతి సీన్‌ మనస్సును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్‌ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం.

మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్‌ను ఆయన మోసిన విధానం అద్భుతం. మహీ తీసిన విధానం, మ్యూజిక్‌, సిరివెన్నల సీతారమశాస్త్రి ‘పల్లెల్లో కళ ఉంది.. పంటల్లో కలిముంది’  అనే లిరిక్స్‌ కదిలించాయి. రోజు పేపర్లో రైతుల ఆత్మహత్యలు చూసి మొండిగా తయారయ్యాం. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మంచి సినిమా. ఈ అనుభూతిని వర్ణించలేను. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. నిన్న చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. చాలా తృప్తినిచ్చిన పాత్ర. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్‌, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తన అనుభూతి పంచుకున్నారు.

మరిన్ని వార్తలు