ఓటమి అనేది నా జీవితంలోనే లేదు

19 Jan, 2020 01:01 IST|Sakshi
పరుచూరి గోపాలకృష్ణ, కృష్ణంరాజు, శ్యామలాదేవి

– కృష్ణంరాజు

‘‘గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్‌ కూడా అలాంటివాడే. నేను హీరోగా తెలుగు, తమిళ, కన్నడ మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు సంపాదిస్తే, ప్రభాస్‌ ఏకంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు’’ అన్నారు కృష్ణంరాజు. రేపు (జనవరి 20) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు కృష్ణంరాజు. సతీసమేతంగా కేక్‌ కట్‌ చేసిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అందరికీ ఏదో ఓ వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితుల్ని చేసుకోవడం వ్యసనం. ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది.

మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ ఉంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం, మనవూరి పాండవులు’ వంటి సినిమాలు చేశా. ‘తాండ్రపాపారాయుడు’ సమయంలో 5వేల మందితో యుద్ధ సన్నివేశాలు తీశాం. అంతమందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి తెలిసింది. ఇప్పుడు మా బ్యానర్‌లో ప్రభాస్‌ కొత్త చిత్రం వస్తుంది. 3 నెలలపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తాం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నేను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలనుకుంటాడు తప్ప తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోడు. నేను కూడా అంతే. ఈ  కృష్ణంరాజు ఓటమిని ఎప్పుడూ అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమి అనేది నా జీవితంలోనే లేదు’’ అన్నారు.
అనంతరం తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌  కష్ణంరాజుని సత్కరించింది.

మరిన్ని వార్తలు