త్వరలోనే నేర్చుకుంటా!

25 Mar, 2017 02:59 IST|Sakshi
త్వరలోనే నేర్చుకుంటా!

నటి రితికాసింగ్‌కు కలిగిన ఆశ ఏమిటో తెలుసా? ఇరుదు చుట్రు చిత్రంతో ఏక్‌ ధమ్‌గా హిందీ, తెలుగు భాషల్లో కథానాయకిగా, అదీ తన చుట్టూ తిరిగే కథా పాత్రతో పరిచయమైన ఉత్తరాది లక్కీ నటి రితికాసింగ్‌. అంతే కాదు తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును పొందడంతో పాటు, అదే చిత్ర రీమేక్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి అవకాశం ఎంతమందికి దక్కుతుంది. రితికాసింగ్‌ నటించిన తెలుగు చిత్రం గురు త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇక తమిళంలో రాఘవ లారెన్స్‌తో జత కట్టిన శివలింగ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో అరవిందస్వామి కి జంటగా నటిస్తోంది.

ఈ సందర్భంగా రితికాసింగ్‌ను పలకరిస్తే బోలెడు కబుర్లు చెప్పుకొచ్చింది. అవేమిటో చూద్దాం. నా జీవితం బాక్సింగ్‌ మైదానంలోనే మగ్గిపోతుందని భావించాను. అలాంటిది భగవంతుడు శుభ (ఇరుదు చుట్రు చిత్ర దర్శకురాలు)అనే దేవతను పంపి నా జీవితాన్ని మార్చేశాడు. నాకు తమిళ భాష నేర్చుకోవాలనే ఆసక్తి బాగా పెరిగింది. అందుకు తమిళ చిత్రాలు అధికంగా చూస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో లంగా ఓణి ధరించిన అమ్మాయిలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను అలా జీవించలేకపోయినా కనీసం అలాంటి పాత్రల్లో లంగా ఓణి ధరించి నటించాలని ఆశపడుతున్నాను.

అంతగా తమిళ సంస్కృతి, ఇక్కడి ప్రజలు నచ్చారు. ఇకపోతే తమిళ భాషను నేర్చుకుంటున్నాను. సాధ్యమైనంత వరకూ సహచరులతో తమిళంలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అలా తప్పుల తడకతో మాట్లాడడానికి కష్టపడుతున్నా త్వరలోనే తమిళ భాషను నేర్చుకుని పక్కాగా మాట్లాడతాననే నమ్మకం ఉంది. అదేవిధంగా తొలి చిత్రమే నన్ను జాతీయ అవార్డు స్థాయికి తీసుకెళ్లడంతో పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.