సూర్య అవుట్... డాలీ ఇన్!

19 Jun, 2016 22:37 IST|Sakshi
సూర్య అవుట్... డాలీ ఇన్!

పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న తాజా చిత్రం లాంచనంగా ప్రారంభమై దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడంతో కథా చర్చల దశలో ఉందనీ, రేపో మాపో చిత్రీకరణ మొదలుపెట్టేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే అసలు విషయం అది కాదని నిర్ధారణ అయ్యింది. చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని ఆదివారం చిత్రనిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

తమిళంలో ఎస్.జె. సూర్య నటించిన ‘ఇరైవి’ ఇటీవల విడుదలైంది. ఆ చిత్రం తర్వాత సూర్యకు తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పలు అవకాశాలు రావడంతో పవన్ కల్యాణ్‌తో కమిట్ అయిన చిత్రానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి. ఈ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కల్యాణ్‌తో చర్చించి, సూర్య స్థానంలో వేరే దర్శకుణ్ణి తీసుకోవాలని శరత్ మరార్ నిర్ణయించుకున్నారు.

సూర్యతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారట. ఎలాంటి భిన్నాభిప్రాయాలకూ తావు లేకుండా ముగ్గురూ ఒక అవగాహన వచ్చాకే వేరే దర్శకుణ్ణి నిర్ణయించారు. వెంకటేశ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ‘గోపాల గోపాల’ తెరకెక్కించిన డాలీ (కిశోర్‌కుమార్ పార్థసాని) ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. జూలై నెలాఖరున షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా